యుజీన్ (అమెరికా): మూడు పదుల వయసు దాటినా... ఒక మగబిడ్డకు తల్లి అయినా... విజయకాంక్ష ఉంటే అత్యున్నత వేదికపై అదరగొట్టడం సుసాధ్యమేనని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ నిరూపించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 35 ఏళ్ల షెల్లీ ఆన్ ఫ్రేజర్ ఎవరికీ సాధ్యంకాని ఘనతను నమోదు చేసింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డుస్థాయిలో ఐదోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది.
తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే ఈవెంట్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా షెల్లీ కొత్త చరిత్ర లిఖించింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల ఫైనల్లో షెల్లీ 10.67 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి జగజ్జేతగా నిలిచింది.
జమైకాకే చెందిన షెరికా జాక్సన్ (10.73 సెకన్లు) రజతం, ఎలైని థాంప్సన్ హెరా (10.81 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి మహిళల 100 మీటర్ల విభాగంలో ఒకే దేశానికి చెందిన ముగ్గురు అథ్లెట్స్ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేరాయి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలోనూ జమైకా క్లీన్‌స్వీప్ చేసింది. ‘టోక్యో’లో షెరికా స్వర్ణం, షెల్లీ రజతం, ఎలైని థాంప్సన్ కాంస్యం సాధించారు.
►5: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో షెల్లీ నెగ్గిన స్వర్ణాలు. 2009 (బెర్లిన్), 2013 (మాస్కో), 2015 (బీజింగ్), 2019 (దోహా) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ షెల్లీకి పసిడి పతకాలు లభించాయి.
►12: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో షెల్లీ నెగ్గిన మొత్తం పతకాలు. అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్స్ జాబితాలో షెల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అలీసన్ ఫెలిక్స్ (అమెరికా; 19 పతకాలు), మెర్లీన్ ఒట్టి (జమైకా; 14 పతకాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment