World Billiards Championship
-
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా సౌరవ్ కొఠారి
విశ్వ వేదికపై గతంలో రెండుసార్లు తుది పోరులో బోల్తా పడ్డ భారత బిలియర్డ్స్ ఆటగాడు సౌరవ్ కొఠారి మూడో ప్రయత్నంలో మాత్రం మెరిశాడు. తొలిసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో సౌరవ్ కొఠారి 1134–944 పాయింట్ల తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో సౌరవ్ కొఠారి 1317–1246 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ డేవిడ్ కాసియర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. -
మళ్లీ ప్రపంచాన్ని గెలిచాడు....
తాము ఎంచుకున్న ఆటలో ఒక్కసారైనా ప్రపంచ చాంపి యన్‌గా నిలవాలని క్రీడాకారులు కలలు కంటారు. అలాంటిది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 17 సార్లు ప్రపంచ టైటిల్ సాధిస్తే ఆ ఘనత అసాధారణం. భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ అలాంటి ఘనతనే సాధించాడు. ప్రపంచ టైటిల్ అంటే తనకు మంచినీళ్లప్రాయంలా మారిందని నిరూపిస్తూ ఈ బెంగళూరు ఆటగాడు ఆదివారం మరోసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. దోహా: గత ఏడాది ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (150 అప్ ఫార్మాట్) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6–2 (0–155, 150–128, 92–151, 151–0, 151–6, 151–0, 150–58, 150–21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. రసెల్‌తో జరిగిన ఫైనల్లో పంకజ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఫ్రేమ్‌ను రసెల్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దక్కించుకున్నాడు. అయితే రెండో ఫ్రేమ్‌లో పంకజ్ తేరుకొని స్కోరును సమం చేశాడు. మూడో ఫ్రేమ్‌ను కోల్పోయిన ఈ భారత స్టార్ నాలుగో ఫ్రేమ్ నుంచి తన జోరును ప్రదర్శించాడు. రసెల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ 5–2తో రూపేశ్ షా (భారత్)పై, రసెల్ 5–1తో పీటర్ గిల్‌క్రిస్ట్ (ఇంగ్లండ్)పై గెలిచారు. సోమవారం ఇదే వేదికపై లాంగ్అప్ ఫార్మాట్లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. ఈ ఫార్మాట్లోనూ పంకజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. లాంగ్అప్ ఫార్మాట్ పోటీలు ముగిశాక ఈనెల 15న విజేతలకు ట్రోఫీలను అందజేస్తారు. తాజా విజయంతో పంకజ్ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్–2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్–2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
రన్నరప్ కొఠారి
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్ 617-1500 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో సౌరవ్ 1250-816తో ధ్వజ్ హరియా (భారత్)పై, గిల్‌క్రిస్ట్ 1250-958తో రూపేశ్ షా (భారత్)పై గెలిచారు. -
అద్వానీకి మరో ప్రపంచ టైటిల్
అడిలైడ్: భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్‌ను 1168 పాయింట్ల తేడాతో ఓడించిన అద్వానీ విజేతగా నిలిచాడు. 30 ఏళ్ల అద్వానీకి ఇది 14వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. గత వారం పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో గిల్‌క్రిస్ట్ చేతిలోనే ఓడిన అద్వానీ తాజాగా టైమ్ ఫార్మాట్లో ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో పంకజ్ 2408 (127, 360, 301, 284, 124, 101, 106, 171, 114, 430 నాటౌట్) పాయింట్లు సాధించగా... గిల్‌క్రిస్ట్ 1240 (102, 156, 249, 107, 198) పాయింట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. అంతకుముందు పంకజ్ ఆరంభంలోనే సెంచరీ (127) బ్రేక్‌తో ఆధిక్యం కనబరిచాడు. ఆ తర్వాత వరుసగా రెండు ట్రిపుల్ సెంచరీ బ్రేక్‌లతో చెలరేగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ‘చక్కటి ప్రణాళికతోనే ఈ విజయం దక్కింది. ఫైనల్‌కు ముందు రోజు రాత్రి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ శ్రీ సలహాలతో పాటు చక్కటి నిద్ర కూడా ఈ గెలుపునకు కారణమైంది’ అని ఇటీవలే 6-రెడ్ స్నూకర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అద్వానీ తెలిపాడు. -
ప్రపంచ బిలియర్డ్స్ ఫైనల్లో అలోక్
లీడ్స్: భారత ఆటగాడు అలోక్ కుమార్ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో అతను 5-1 ఫ్రేమ్‌ల తేడాతో సహచరుడు దేవేంద్ర జోషిపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఈ పోరులో అలోక్ 150-52, 150-34, 117-150, 150-37, 150-116, 150-138తో జోషిపై గెలుపొందాడు. ఫైనల్లో భారత ఆటగాడు... ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ కాసియెర్తో తలపడతాడు. మరో సెమీస్‌లో కాసియెర్ 5-1 (150-46, 79-150, 150-37, 150-27, 150-28, 150-7) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కే చెందిన రాబర్ట్ హాల్‌ను కంగుతినిపించాడు.