అద్వానీకి మరో ప్రపంచ టైటిల్
అడిలైడ్: భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్‌ను 1168 పాయింట్ల తేడాతో ఓడించిన అద్వానీ విజేతగా నిలిచాడు. 30 ఏళ్ల అద్వానీకి ఇది 14వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. గత వారం పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో గిల్‌క్రిస్ట్ చేతిలోనే ఓడిన అద్వానీ తాజాగా టైమ్ ఫార్మాట్‌లో ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది.
ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో పంకజ్ 2408 (127, 360, 301, 284, 124, 101, 106, 171, 114, 430 నాటౌట్) పాయింట్లు సాధించగా... గిల్‌క్రిస్ట్ 1240 (102, 156, 249, 107, 198) పాయింట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. అంతకుముందు పంకజ్ ఆరంభంలోనే సెంచరీ (127) బ్రేక్‌తో ఆధిక్యం కనబరిచాడు. ఆ తర్వాత వరుసగా రెండు ట్రిపుల్ సెంచరీ బ్రేక్‌లతో చెలరేగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ‘చక్కటి ప్రణాళికతోనే ఈ విజయం దక్కింది. ఫైనల్‌కు ముందు రోజు రాత్రి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ శ్రీ సలహాలతో పాటు చక్కటి నిద్ర కూడా ఈ గెలుపునకు కారణమైంది’ అని ఇటీవలే 6-రెడ్ స్నూకర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అద్వానీ తెలిపాడు.