Womens recurve team
-
దీపిక... వరల్డ్ నంబర్‌వన్
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకుంది. లీసా బార్బెలిన్ (ఫ్రాన్స్–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపిక రికర్వ్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో తొలి రౌండ్లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. -
‘పసిడి’ కాంతలు
- ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం - పురుషుల జట్టుకు రజతం వ్రోక్లా (పోలండ్): సీజన్లో చివరి ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత ఆర్చరీ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జయంత తాలుక్దార్ సారథ్యంలోని పురుషుల రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు 6-0 (52-50; 54-51; 56-54) స్కోరుతో మెక్సికో జట్టును ఓడించింది. టీమిండియా వరుసగా మూడు సెట్లను గెల్చుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు జయంత తాలుక్దార్, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల బృందం 3-5 (54-56; 52-53; 55-53; 52-52) స్కోరుతో మెక్సికో చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో రెండు జట్లలోని ముగ్గురు సభ్యులకు ఒక్కో రౌండ్లో (గరిష్టంగా నాలుగు రౌండ్లు) రెండేసి బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. ఆరు బాణాల తర్వాత ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి సెట్ వశమవుతుంది. సెట్ నెగ్గితే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే మాత్రం ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఎక్కువ సెట్ పాయింట్లు నెగ్గిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి ఈసారి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ సంధించిన ఐదు 10 పాయింట్ల స్కోరులో దీపికవే మూడు ఉండటం విశేషం. మరోవైపు మెక్సికో జట్టులో కేవలం రెండు 10 పాయింట్ల స్కోరు ఉండటం గమనార్హం. ‘ఫైనల్ మ్యాచ్ కష్టంగా అనిపించలేదు. ఇదే జోరును ఆసియా క్రీడల్లో కొనసాగిస్తామనే నమ్మకం ఉంది. ఈ స్వర్ణ పతకంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. అయితే ఆసియా క్రీడలకు ముందు మా శ్రమకు ఫలితం లభించింది’ అని దీపిక కుమారి వ్యాఖ్యానించింది.