
సాల్ట్ లేక్ సిటీ (అమెరికా): ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో నాలుగో పతకాన్ని జమ చేసుకుంది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 147–140తో జేమీ వ్యాన్ నట్టా–క్రిస్ స్కాఫ్ (అమెరికా) జోడీపై గెలుపొందింది.
మరోవైపు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతం సంపాదించాడు. ఫైనల్లో అభిషేక్ 123–140తో స్టీఫెన్ హాన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది సురేఖ షాంఘై, అంటాల్యా ప్రపంచకప్‌లలో రెండు కాంస్యాలు, ఒక రజతం సాధించింది.