asia record
-
24 అడుగుల భారీ కళాకృతి
సాంస్కృతిక ఐక్యత, సమాజ స్ఫూర్తి కలిగేలా విశాఖపట్నంకు చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ 24 అడుగుల పొడవైన యాక్రిలిక్ కాన్వాస్ పెయింటింగ్ వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ కళాకృతి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని 10 జిల్లాల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఏకీకరణకు దృశ్యంగా నిలిచింది.స్థానిక వారసత్వానికి జీవంస్పష్టమైన రంగులు, క్లిష్టమైన వివరాలతో ఆయా రాష్ట్రాల్లోని కమ్యూనిటీల స్థానిక వారసత్వం, సంప్రదాయాల సారాంశానికి జీవం పోశాడు. కాన్వాస్లోని ప్రతి భాగం ఈ ప్రాంతాలలోని ప్రముఖ ప్రదేశాలు, గిరిజన నృత్యాలు, పండగలు, చేతి పనులు, మార్కెట్లతో పాటు ఈ ప్రాంతాలకు విలక్షణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాలను, వాటితో అనుసంధానంగా ఉండే వ్యక్తుల జీవితాలను కళ్లకు కడుతుంది. ఇవే కాదు గనులు, చిత్రకూట్ జలపాతాలు, కోలాబ్ డ్యామ్, విజయనగరం కోట వంటి మూడు రాష్ట్రాల్లోని 53 ప్రసిద్ధ ప్రదేశాలను చూపుతుంది.సామాజిక జీవనానికి అంకితం‘ఈ ఆర్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంప్రదాయాలు, వాణిజ్యం ఒకచోట చేర్చే విలువలను పంచుకునే కమ్యూనిటీల సామరస్యపూర్వక సహజీవనానికి ఈ కళాకృతి అంకితం. ఈ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నప్పటికీ, నేను నా పని ద్వారా వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని ఆశించాను‘ అని విజయ్ కుమార్ తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ భారీ కళాకృతిని ప్రదర్శించడానికి ఆ శాఖ చొరవ తీసుకోవడం, వారి ప్రాంగణంలో స్థానిక కళ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నానాన్ని అంతా అభినందిస్తున్నారు.(చదవండి: రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!) -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
టోక్యో: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో భారత పురుషుల రిలే జట్టు 4X400 మీటర్ల విభాగంలో కొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. అనస్ యాహియా, టామ్ నోవా నిర్మల్, రాజీవ్ అరోకియా, అమోజ్ జాకబ్‌లతో కూడిన భారత రిలే జట్టు రెండో హీట్‌లో 3ని:00.25 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 3ని:00.56 సెకన్లతో ఖతర్ జట్టు పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత బృందం సవరించింది. అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత వాకర్స్ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో... భావన జాట్ 32వ స్థానంలో నిలిచారు. #IND's 4x400m relay team set a new Asian record at the #Olympics! 😱 Watch Amoj Jacob's finishing blitz that helped India finish fourth in heat 2 and sprint straight into the history books. 🙌#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/gdDYPX2RLD — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021 -
ఒక గంటలో అరవై పాటలు.. రికార్డు
టీ.నగర్: ఒక గంట సమయంలో 60 పాటలు పాడి రాజేష్ వైద్య ఆదివారం రికార్డ్ సాధించాడు. వీణ విద్వాంసుడిగా మేస్ట్రో అవార్డును అందుకున్న రాజేష్ వైద్య ప్రముఖ సంగీత దర్శకుడు జి.రామనాధన్ తమ్ముడి కుమారుడు. రాజేష్‌వైద్య తన బృందంతో 60 నిమిషాల్లో 60 పాటలు పాడి ఆసియా స్థాయిలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు సృష్టించారు. ఆసియా దేశంలో గల ప్రముఖులను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఆ సంస్థ వెలుగులోకి తీసుకువస్తున్నది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజేష్‌వైద్య రికార్డును నెలకొల్పడంతో అనేక మంది నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రసన్న, నటి సుహాసినిలు పాల్గొని రాజేష్వైద్యను అభినందించారు. -
ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు..
కోయంబత్తూరు: ఆరేళ్లప్రాయంలోనే తమిళనాడుకు చెందిన ఓ బాలిక స్కేటింగ్‌లో ఆసియా రికార్డులోకి ప్రవేశించింది. కేవలం 41.3 నిమిషాల్లోనే 10.5 కిలోమీటర్ల వరకు వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో తొలి రికార్డు సృష్టించింది. తమిళనాడులో యువభారతి పబ్లిక్ స్కూల్లో చదువుతున్న కె దర్శని (6)విద్యార్థిని క్వార్టర్ స్కేటింగ్ మారథాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్కేటింగ్ పోటీలో పాల్గొంది. ఈ పోటీలో పాల్గొన్న చిన్నారి.. అత్యంత వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆదివారం కోయంబత్తూరులో తమిళనాడు స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్(టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ) జనరల్ సెక్రటరీ మురుగానందం మాట్లాడుతూ.. స్కేటింగ్‌లో ఆసియాలో ఈ తరహా రికార్డ్ సృష్టించడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. 150 బంగారు పథకాలను కైవసం చేసుకున్న చిన్నారి దర్శని.. 2014లో నిర్వహించిన కోయంబత్తూరు జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 500 మీటర్ల స్కేటింగ్‌లోనూ, అదే ఏడాది తమిళనాడు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుతంగా స్కేటింగ్ చేసి ప్రతిభను కనబర్చింది. గతనెలలో గోవాలో జాతీయ స్థాయిలో టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో చిన్నారి దర్శని.. బంగారు, కాంస్య పథకాలను సాధించింది. వచ్చే నెల సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కేటింగ్ పోటీల్లో చిన్నారి దర్శనిని టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఎంపికచేయనుంది.