అంతర్జాతీయ టి20ల్లో కొత్త ప్రపంచ రికార్డు
ఆరు సిక్సర్లు కొట్టిన సమోవా బ్యాటర్ విసెర్
టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ
అపియా (సమోవా): అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో మంగళవారం అద్భుతం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు, సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్‌లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా... సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది.
మిడిలార్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో వనువాటుపై సమోవా 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
విసెర్ (62 బంతుల్లో 132; 5 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నళిన్ నిపికో (52 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఆ ఓవర్ సాగిందిలా..
వనువాటు బౌలర్ నళిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6+1నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్; 2007లో ఇంగ్లండ్‌పై; స్టువర్ట్ బ్రాడ్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్; 2021లో శ్రీలంకపై; అఖిల ధనంజయ), నికోలస్ పూరన్ (వెస్టిండీస్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; అజ్మతుల్లా ఓమర్‌జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్;2024లో ఖతర్‌పై; కమ్రాన్ ఖాన్), రోహిత్ శర్మ–రింకూ సింగ్ (భారత్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు.
అయితే తాజా మ్యాచ్‌లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో... మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్‌గా విసెర్ రికార్డుల్లోకెక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా.. అందులో విసెర్ ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86 శాతం విసెర్ బ్యాట్ నుంచే వచ్చాయి. గతంలో ఆ్రస్టేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ జట్టు స్కోరులో 75.01 శాతం పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment