జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, పోర్చుగల్... ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అంటే ఈ దేశాలు మాత్రమేనా! అప్పుడప్పుడు మెరిసే ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో ఉన్నాయి. సంచలనం సృష్టించేందుకు సదా సిద్ధం అనిపించే కొరియా, కొలంబియా, డెన్మార్క్‌లు కూడా బరిలో నిలిచాయి. 32 దేశాలు పాల్గొనే విశ్వ సమరంలో ఒక్కో జట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అగ్రశ్రేణి జట్లు అద్భుత ఆటను చూపిస్తాయనడంలో సందేహం లేకున్నా... అనామక టీమ్‌లు కూడా అభిమానులకు వినోదం పంచడంలో ఎక్కడా తగ్గవు. తీవ్ర పోటీ ఉండే క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ఇక్కడి వరకు వచ్చాయంటే వాటి సత్తాను తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్ కప్ బరిలో నిలిచిన జట్ల పరిచయం, వాటి నాకౌట్ అవకాశాల వివరాలు నేటి నుంచి... ముందుగా ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఉన్న గ్రూప్ ‘ఇ’పై విశ్లేషణ.
బ్రెజిల్... పూర్వ వైభవం కోసం
2014లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ సెమీస్‌లో జర్మనీ చేతిలో 1–7తో బ్రెజిల్ చిత్తు చిత్తుగా ఓడినప్పుడు ఆ దేశ అభిమానులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల గుండెలు బద్దలయ్యాయి. ఆ తర్వాత కోలుకొని ఈ నాలుగేళ్లలో బ్రెజిల్ మరోసారి వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. 2018 వరల్డ్ కప్‌కు అందరికంటే ముందుగా అర్హత సాధించిన దేశం బ్రెజిల్. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనాను 3–0తో ఓడించడం సహా వరుసగా 9 మ్యాచ్ లు గెలవడం ఆ జట్టు ఫామ్‌ను చూపిస్తోంది.
కీలక ఆటగాడు: నెమార్
ప్రస్తుతం 26 ఏళ్ల నెమార్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో, ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. తన ఆటతో చెలరేగి బ్రెజిల్‌ను గెలిపించేందుకు అతనికి ఇది సువర్ణావకాశం. అదే జరిగితే మెస్సీ, రొనాల్డోలను వెనక్కి తోసిన ఘనత నెమార్‌కు దక్కుతుంది.
కోచ్: అడెనార్ బాకీ (టిటె). అట్టర్ ఫ్లాప్ జట్టు నుంచి ఇతను బ్రెజిల్‌ను ఫేవరెట్‌గా మలిచాడు. 2016 సెప్టెంబర్‌లో టిటె బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రెజిల్ 13 మ్యాచ్‌లు గెలిచి, 3 డ్రా చేసుకుంది.
వరల్డ్ ర్యాంక్: 2
చరిత్ర: టోర్నీ జరిగిన 20 సార్లూ ఆడింది. 5 సార్లు విజేత (1958, 1962, 1970, 1994, 2002), రెండుసార్లు రన్నరప్ (1950, 1998).
‘స్విస్’ టైమ్ బాగుంటుందా!
అప్పుడప్పుడు తమ ఆటతో కొన్ని మెరుపులు ప్రదర్శించిన స్విట్జర్లాండ్ ఈ సారైనా అన్ని రంగాల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కనీసం క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా జట్టు బరిలోకి దిగుతోంది. 2009 అండర్–17 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ సారి వరల్డ్ కప్ జట్టులో ఉండటం తమ బలంగా ఆ జట్టు భావిస్తోంది. ఇన్నేళ్లలో వీరంతా అనుభవంతో కూడా రాటుదేలారు. 1954లో ఆఖరి సారి నాకౌట్ మ్యాచ్ గెలవగలిగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో బలహీనమైన గ్రూప్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు నెగ్గి అర్హత సాధించింది.
కీలక ఆటగాడు: వలోన్ బెహ్రామి
వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడుతున్న సీనియర్. కుర్రాళ్లను మైదానంలో సమన్వయపరుస్తూ ఫలితం సాధించగలడు. క్వాలిఫయింగ్‌లో అతను ఆడని మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ చిత్తయిందంటే వలోన్ విలువేమిటో తెలుస్తుంది. అకాన్జీవంటి అత్యుత్తమ డిఫెండర్ జట్టులో ఉన్నాడు. గత వరల్డ్ కప్ ఆడిన ‘ఆర్సెనల్’ స్టార్ జాకా కూడా జట్టు రాతను మార్చగలడు.
కోచ్: వ్లదీమర్ పెట్కోవిక్ మూడేళ్లుగా జట్టును తీర్చిదిద్దాడు. ఇతనికి ఇదే తొలి వరల్డ్ కప్
ప్రపంచ ర్యాంక్: 6
చరిత్ర: 10 సార్లు పాల్గొని 3 సార్లు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది.
కోస్టారికా... క్వార్టర్స్ చేరేనా!
నాలుగేళ్ల క్రితం ఈ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరి షూటౌట్‌లో నెదర్లాండ్స్ చేతిలో చిత్తయింది. 50 లక్షలకంటే తక్కువ జనాభా ఉన్న కోస్టా రికా ఐదో వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది.
కీలక ఆటగాడు: గోల్ కీపర్ నవాస్
లీగ్స్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఆడే ఈ గోల్ కీపర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బలహీన జట్టునుంచి ప్రపంచానికి తెలిసిన ఆటగాడు ఇతనొక్కడే. బ్రైన్ రూయిజ్, సెల్సో బోర్జెస్ కూడా సత్తా చాటగలరు. 2014లో క్వార్టర్స్ చేరడంలో రూయిజ్‌దే ప్రధాన పాత్ర.
కోచ్: ఆస్కార్ రమిరెజ్. ఇటలీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ప్రపంచ ర్యాంక్: 25
చరిత్ర: 4 సార్లు పాల్గొంటే 2014లో క్వార్టర్ ఫైనల్స్ చేరడం అత్యుత్తమ ప్రదర్శన.
సెర్బియా... సంచలనంపై గురి
2006లో స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ఈ దేశం వరల్డ్ కప్ బరిలోకి దిగుతుండటం ఇది రెండోసారి. ఈసారి క్వాలిఫయింగ్‌లో తమ గ్రూప్‌లో సెర్బియా అత్యధికంగా 20 గోల్స్ కొట్టింది. అదే జోరును కనబరిచి లీగ్ దశ దాటాలని పట్టుదలతో ఉంది.
కీలక ఆటగాడు: బ్రనిస్లావ్ ఇవనోవిక్
చెల్సీ తరఫున గొప్ప ప్రదర్శన కనబర్చిన డిఫెండర్. క్వాలిఫయింగ్‌లో అన్ని మ్యాచ్‌లూ (10) ఆడాడు.
కోచ్: కటాజిక్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
వరల్డ్ ర్యాంక్: 35
చరిత్ర: 2010లో తొలిసారి బరిలోకి దిగి లీగ్ దశలోనే నిష్క్రమించింది.
మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. తమ గ్రూప్‌లోని మిగిలిన మూడు ప్రత్యర్థులతో ఆయా జట్లు తలపడతాయి. పాయింట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్ట్సర్స్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్లు సమమైతే గోల్స్ ఆధారంగా ఎవరు ముందుకు వెళ్లాలో తేలుస్తారు.
తుది అంచనా: గ్రూప్ ‘ఇ’ నుంచి బ్రెజిల్, స్విట్జర్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
బెహ్రామి, నవాస్, ఇవనోవిక్
సాంబాకు ఎదురుందా!
Published Mon, Jun 4 2018 3:02 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment