
న్యూఢిల్లీ: మొహమ్మద్ షహజాద్ అఫ్గానిస్తాన్ క్రికెటర్. చూసేందుకు దిట్టంగా కనపడినా... ఆడేందుకు బాగానే ఉంటాడు. అదేంటో మరి ఓ ఆటగాడికి ఉండాల్సిన ఫిట్‌నెస్ తాలుకూ లక్షణాలేవీ అతని రూపురేఖల్లో కనపడవు. ఎందుకంటే ఎత్తులో ఆరడుగులైనా (5.8) లేని షహజాద్ బరువులో ఏకంగా 90 కేజీలకు మించిపోయాడు. మంచి భోజనప్రియుడైన ఈ 30 ఏళ్ల బ్యాట్స్‌మన్ 2009 నుంచి అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంత లావెక్కినా... తన ఫిట్‌నెస్‌ను తాను సమర్థించుకుంటున్నాడు. ‘చూడండి నేను ఫిట్‌నెస్ కోసం కష్టపడతాను. బాగా తినేందుకు ఇష్టపడతాను.
కానీ కోహ్లికున్న ఫిట్‌నెస్ మాత్రం నాకు ఉండదు. అయితే మైదానంలో అతనిలా భారీ సిక్సర్ కొట్టే సత్తా నాకుంది. అలాంటప్పుడు కోహ్లిలా నోరు కట్టేసుకొని మరీ డైటింగ్ చేయాల్సిన అవసరమేముంది. మా కోచ్ (ఫిల్ సిమన్స్)కు నా గురించి బాగా తెలుసు. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలననే నమ్మకం ఉంది. నా శరీర బరువు నాకెప్పుడు సమస్య కాలేదు’ అని షహజాద్ అన్నాడు. భారత జట్టులో ధోని, సురేశ్ రైనా, ధావన్‌లు తనకు మంచి మిత్రులని అతను చెప్పుకొచ్చాడు. ధోని తరహాలో హెలికాప్టర్ షాట్లు కొట్టే షహజాద్ ఏడాది డోపింగ్ నిషేధం తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చి ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం.