దర్జాగా దక్షిణాఫ్రికా గెలుపు | South Africa Vs Afghanistan Highlights, ICC ODI World Cup 2023: South Africa Beat Afghanistan By 5 Wickets - Sakshi
Sakshi News home page

దర్జాగా దక్షిణాఫ్రికా గెలుపు

Published Sat, Nov 11 2023 2:58 AM | Last Updated on Sat, Nov 11 2023 8:05 AM

Safari victory by five wickets - Sakshi

అహ్మదాబాద్‌: ఈ వన్డే వరల్డ్‌కప్‌లో అందరినీ ఆకట్టుకున్న అఫ్గానిస్తాన్‌ పోరాటం చివరకు పరాజయంతో ముగిసింది.  ఇది వరకే సెమీఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈనెల 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియాతో జరిగే రెండో సెమీఫైనల్‌ పోరులో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనుంది. నిర్ణీత తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా ఏడో విజయంతో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

అసాధ్యమైన సమీకరణంతో సెమీఫైనల్‌ ఆశలు వదులుకున్న అఫ్గానిస్తాన్‌ ఈ మెగా ఈవెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తోపాటు మాజీ విశ్వవిజేతలు పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించామన్న సంతృప్తితో స్వదేశానికి వెళ్లనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (107 బంతుల్లో 97 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్‌ కొయెట్జీ 4, ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వాన్‌డర్‌ డసెన్‌ (95 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచి గెలిపించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, మొహమ్మద్‌ నబీ చెరో 2 వికెట్లు తీశారు. 

ఒమర్జాయ్‌ ఒంటరిగా... 
ఓపెనర్లు ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (15), రహ్మానుల్లా గుర్బాజ్‌ (22 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పెద్దగా రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా (2) కూడా నిరాశపరచడంతో 45 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్‌ను మిడిలార్డర్‌ బ్యాటర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ ఆదుకున్నాడు. 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అవతలివైపు రహ్మత్‌ షా (46 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఇక్రామ్‌ (12), రషీద్‌ ఖాన్‌ (14), నూర్‌ అహ్మద్‌ (32 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఇలా ఏ ఒక్కరు బాధ్యతగా క్రీజులో నిలువలేకపోయినా... అజ్మతుల్లా మాత్రం కడదాకా నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. శతకానికి 3 పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. అతని పోరాటం వల్లే  అఫ్గాన్‌ ఆ మాత్రం స్కోరు చేసింది. 

ఆదుకున్న డసెన్‌ 
సునాయాస లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు డికాక్‌ (47 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ బవుమా (28 బంతుల్లో 23; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌), క్లాసెన్‌ (10) లాంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో 139 పరుగులకే 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన డసెన్‌... మిల్లర్‌ (33 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి పరిస్థితి చక్కదిద్దాడు. తర్వాత ఫెలుక్‌వాయో (37 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా సంచలనానికి తావివ్వకుండా గెలిచింది. అబేధ్యమైన ఆరో వికెట్‌కు డసెన్, ఫెలుక్‌వాయో 65 పరుగులు జోడించారు. 

స్కోరు వివరాలు 
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) క్లాసెన్‌ (బి) కేశవ్‌ 25; జద్రాన్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జీ 15; రహ్మత్‌ షా (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 26; హష్మతుల్లా (సి) డికాక్‌ (బి) కేశవ్‌ 2; అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (నాటౌట్‌) 97; ఇక్రామ్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జీ 12; నబీ (సి) డికాక్‌ (బి) ఎన్‌గిడి 2; రషీద్‌ ఖాన్‌ (సి) డికాక్‌ (బి) ఫెలుక్‌వాయో 14; నూర్‌ అహ్మద్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జీ 26; ముజీబ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) కొయెట్జీ 8; నవీనుల్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 244. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–45, 4–94, 5–112, 6–116, 7–160, 8–204, 9–226, 10–244. బౌలింగ్‌: రబడ 10–0–40–0, ఎన్‌గిడి 8.3–0–69–2, మార్క్‌రమ్‌ 4.3–0–25–0, కొయెట్జీ 10–1–44–4, కేశవ్‌ మహరాజ్‌ 10–1–25–2, ఫెలుక్‌వాయో 7–0–36–1. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 41; బవుమా (సి) గుర్బాజ్‌ (బి) ముజీబ్‌ 23; డసెన్‌ (నాటౌట్‌) 76; మార్క్‌రమ్‌ (సి) నవీనుల్‌ (బి) రషీద్‌ 25; క్లాసెన్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 10; మిల్లర్‌ (సి అండ్‌ బి) నబీ 24; ఫెలుక్‌వాయో (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–116, 4–139, 5–182. బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–51–1, నవీనుల్‌ 6.3–0–52–0, నబీ 10–1–35–2, ఒమర్జాయ్‌ 1–0–8–0, రషీద్‌ ఖాన్‌ 10–1–37–2, నూర్‌ అహ్మద్‌ 9–0–49–0, రహ్మత్‌ షా 1–0–12–0.  

ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా   X  బంగ్లాదేశ్‌
వేదిక: పుణే
ఉదయం గం. 10:30 నుంచి

ఇంగ్లండ్‌ X పాకిస్తాన్‌
వేదిక: కోల్‌కతా
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement