ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్‌లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్‌కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు.
అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్‌కే వన్నె తెచ్చాడు.
ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్‌వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు.
అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు.
హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్‌వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి.
జబర్దస్త్ జద్రాన్...
ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్‌కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్‌కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు.
ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ!
హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్‌లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్‌ను చూశాయి.
కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్‌లు
ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్‌లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్‌కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్‌కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్‌తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్‌తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు.
రాత మార్చిన ఘనుడు
మ్యాక్స్‌వెల్ భారీ హిట్టింగ్‌కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్‌తో కలిసి జట్టు రాతను తన బ్యాట్‌తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే!
బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి...
సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్‌పై 8వ వికెట్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్
పరుగులు 201 నాటౌట్ బంతులు 128
4 x 21; 6 x 10
1 x 39; 2 x 9
స్ట్రయిక్‌రేట్ 157.03
201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు.
3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్‌లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్‌బెర్రాలో) ఈ ఘనత సాధించారు.
2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది.
1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు.
2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్‌వుడ్ (బి) మ్యాక్స్‌వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్‌వుడ్ 9–0–39–2, మ్యాక్స్‌వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0.
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్‌య్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0.
ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్ x నెదర్లాండ్స్
వేదిక: పుణే
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment