అది గుర్తుకొస్తే నా ఒళ్లు జలదరిస్తుంది: రషీద్‌ ఖాన్‌ | When I Think About That My Body Just: Rashid Khan On Maxwell Knock 2023 WC Vs Afghanistan | Sakshi

అది గుర్తుకొస్తే నా ఒళ్లు జలదరిస్తుంది: రషీద్‌ ఖాన్‌

Published Sat, Jun 22 2024 5:33 PM | Last Updated on Sat, Jun 22 2024 5:48 PM

When I think About That My Body Just: Rashid Khan On Maxwell Knock 2023 WC Vs Afg

టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8లో ఆదివారం ఉదయం ఆసక్తికర పోరు జరుగనుంది. గ్రూప్‌-1లో భాగమైన అఫ్గనిస్తాన్‌ పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెయింట్‌ విన్సెంట్‌లోని కింగ్స్‌టౌన్‌ స్టేడియం ఇందుకు వేదిక.

ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గన్‌ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.

మాక్స్‌వెల్‌ రాకతో అంతా తలకిందులు
ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సెంచరీ కారణంగా 292 పరుగులు స్కోరు చేసిన అఫ్గనిస్తాన్‌.. లక్ష్య ఛేదనలో కంగారూ జట్టును ఆది నుంచే బెంబేలెత్తించింది. అయితే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రాకతో అంతా తలకిందులైంది.

అఫ్గన్‌తో మ్యాచ్లో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మాక్సీ గట్టెక్కించాడు. కండరాల నొప్పి వేధిస్తున్నా లెక్క చేయక డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించాడు.

నా ఒళ్లు జలదరిస్తుంది
ఇక ఇరు జట్లు ఇలా మరోసారి ఐసీసీ టోర్నీలో తలపడనున్న నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌ ఐసీసీ డిజిటల్‌తో తన మనసులోని భావాలు పంచుకున్నాడు. నాటి మాక్సీ ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘రాత్రిపూట నేను నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక్కోసారి ఆట గురించి తలచుకుంటాను.

అలాంటపుడు నా ఒళ్లు జలదరిస్తుంది. అసలు అదొక అద్భుత, నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌. మేము చూసిన అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లో అదొకటి’’ అని రషీద్‌ ఖాన్‌ మాక్స్‌వెల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు.

కాగా సూపర్‌-8లో టీమిండియా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్‌కు ఆసీస్‌తో పోరు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, కంగారూ జట్టుతో అంత ఈజీ కాదన్న విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి
మరోవైపు.. సూపర్‌-8లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఆంటిగ్వాలో ఆసీస్‌ 28 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ (36 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌), తౌహీద్‌ హృదయ్‌ (28 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో కమిన్స్‌ ‘హ్యాట్రిక్‌’తో టీమ్‌ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో ఐదో బంతికి మహ్ముదుల్లా (2), చివరి బంతికి మెహదీ హసన్‌ (0)లను అవుట్‌ చేసిన కమిన్స్‌... ఆ తర్వాత 20వ ఓవర్‌ తొలి బంతికి తౌహీద్‌ను వెనక్కి పంపి ‘హ్యాట్రిక్‌’ పూర్తి చేసుకున్నాడు.

తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులు
అనంతరం ఆస్ట్రేలియాకు వార్నర్‌ (35 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు),  హెడ్‌ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు.

అనంతరం రిషాద్‌ తన వరుస ఓవర్లలో హెడ్, మార్ష్‌ (1)లను అవుట్‌ చేయగా...11.2 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. వాన ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆ స్థితిలో ముగిస్తున్నట్లు ప్రకటించారు.

డక్‌వర్త్‌ నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఆసీస్‌ 72 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ అప్పటికే 28 పరుగులు ముందంజలో ఉన్న కంగారూ టీమ్‌ విజేతగా నిలిచింది.  

‘హ్యాట్రిక్‌’ల రికార్డు
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నమోదైన ‘హ్యాట్రిక్‌’ల సంఖ్య ఏడు. బ్రెట్‌లీ (2007) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో  ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్‌ నిలవగా... గతంలో కర్టిస్‌ కాంఫర్‌ (ఐర్లాండ్‌), హసరంగ (శ్రీలంక), రబాడ (దక్షిణాఫ్రికా), కార్తీక్‌ మెయప్పన్‌ (యూఏఈ), జోష్‌ లిటిల్‌ (ఐర్లాండ్‌) ఈ ఘనతను నమోదు చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement