వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 291 పరుగులు చేసిన ఆఫ్ఘన్లు ఓ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించేలా కనిపించారు. అయితే మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఫ్ఘన్ల ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాక్సీ ఆఫ్ఘన్లకు విజయాన్ని దూరం చేయడంతో పాటు వారి సెమీస్ అవకాశాలను సైతం సంక్లిష్టం చేశాడు. ఊహించని ఈ ఓటమితో ఆఫ్ఘన్లు ఖంగుతిన్నారు. వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఇది వారి కెప్టెన్ మాటల్లో స్పష్టంగా తెలిసింది.
మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీది మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది. మేం ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము. ఓ దశలో గెలుస్తామని పూర్తి విశ్వాసంగా ఉన్నాము. క్రికెట్ తమాషా ఆట. క్షణాల వ్యవధిలో ఫలితం తారుమారవుతుంది. మ్యాక్స్‌వెల్ మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. అయితే డ్రాప్ క్యాచ్‌లు మా కొంపముంచాయి. పలు మార్లు లైఫ్‌లు లభించిన అనంతరం మ్యాక్స్‌వెల్ ఆగలేదు.
అతను ప్రతి రకమైన షాట్ ఆడాడు. క్రెడిట్ మొత్తం అతనికే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ సాగిన తీరు వర్ణణాతీతం. మా బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేసినా అతను మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జారవిడిచిన క్యాచ్‌లకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ, జట్టు ప్రదర్శన పట్ల ఇప్పటికీ గర్వంగా ఉంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా ఆటలో భాగం. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పుంజుకుంటాం.
ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుం. అతన్ని చూస్తే గర్వంగా ఉంది. వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆఫ్ఘన్‌గా రికార్డుల్లోకెక్కినందుకు అతను కూడా గర్వపడాలి అని అన్నాడు.
కాగా, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీం జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్ ఓ దశలో (91/7) ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే మ్యాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో వారిని విజయతీరాలకు చేర్చాడు.
ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ తమ చివరి లీగ్ మ్యాచ్ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉంది.
చదవండి: గొప్ప విజయం.. మ్యాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment