క్రికెట్‌లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం సర్వ సాధారణం. ఇక్కడ ఓ ప్రదర్శనను తక్కువ చేసి, మరో దాన్ని ఎక్కువ చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. కానీ, ఏ ప్రదర్శన జట్టు విజయానికి ఎక్కువగా దోహదపడిందని విశ్లేషించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి ఓ పోలికనే ఇప్పుడు మనం చూడబోతున్నాం.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) గెలిపించాడు. 1983 ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ఇన్నింగ్స్‌ను మనం చూశాం.
నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు, నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 175 పరుగులు చేశాడు. కపిల్ ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్ కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది.
తాజాగా మాక్సీ మెరుపు ఇన్నింగ్స్ చూశాక చాలా మంది అభిమానులు నాటి కపిల్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కొందరేమో మాక్సీ డబుల్‌ను కపిల్ 175తో పోలుస్తున్నారు. ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య పోలిక పెట్టి, ఏది గొప్ప అని నిర్ణయించడానికి ఆస్కారమే లేదు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇక్కడ అభిమానులు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు. అది తక్కువ, ఇది ఎక్కువ అని తేల్చడానికి వీలు లేదు.
రెండు సందర్భాల్లో ఆటగాళ్లు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. నాడు కపిల్ బరిలోకి దిగిన సందర్భంలో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఆ సమయంలో కపిల్ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా మ్యాక్స్‌వెల్ సైతం తన జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు (292 పరుగుల లక్ష్యఛేదనలో 91/7 స్కోర్ వద్ద) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.
అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కపిల్ ఇన్నింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ చేసినది కాగా, మాక్సీ ఛేదనలో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ, అక్కడ ఆటగాళ్లు తమతమ జట్ల గెలుపుకు వంద శాతం దోహదపడ్డారు. ఇద్దరూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక్కడ మ్యాక్సీ పోరాడితే పోయేది ఏమీ లేదని సక్సెస్ సాధించగా.. నాడు కపిల్ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి ఫలితం రాబట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment