CWC 2023 AUS V AFG: క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ | CWC 2023 AUS Vs AFG: Maxwell Destruction He Records Highest Individual Score In Run Chase, Best Ever Chase In History Of Cricket - Sakshi
Sakshi News home page

CWC 2023 AUS Vs AFG Highlights: క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌

Published Wed, Nov 8 2023 8:21 AM | Last Updated on Wed, Nov 8 2023 8:45 AM

CWC 2023 AUS VS AFG: Maxwell Destruction, Best Ever Chase In History Of Cricket - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మ్యాక్సీ ఊహకందని ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. మ్యాక్స్‌వెల్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా కీర్తించబడుతుంది.

ఛేదనలో ఈ స్థాయి ఇన్నింగ్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవ్వరూ ఆడి ఉండరని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మ్యాక్సీ నామస్మరణతో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. సాహో మ్యాక్సీ అంటూ జనం కొనియాడుతున్నారు. మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ చూసి విమర్శకులు సైతం ముగ్దులవుతున్నారు. ఈ ఇన్నింగ్స్‌ వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మున్ముందు కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌ చూడలేమని ఆకాశానికెత్తుతున్నారు.

లక్ష్యానికి 201 పరుగుల దూరంలో ఉండి, చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలంటే చాలా గట్స్‌ కావాలని అంటున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని (లక్ష్య ఛేదనను) చేసి చూపించి సాహో మ్యాక్సీ అనిపించుకున్నాడని కితాబునిస్తున్నారు. ఓ పక్క గాయం వేధిస్తున్నా దిగమింగుతూ, జట్టును గెలిపించేందుకు​ అతను చూపిన తెగువ అసమానమని కొనియాడుతున్నారు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (143 బంతుల్లో 129 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం మ్యాక్స్‌వెల్‌ అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement