గొప్ప విజయం.. మాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్‌ | CWC 2023 AFG Vs AUS: Pat Cummins Comments After Terrific Win Against Afghanistan Goes Viral - Sakshi
Sakshi News home page

AUS VS AFG: గొప్ప విజయం.. మాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్‌

Published Wed, Nov 8 2023 9:24 AM | Last Updated on Wed, Nov 8 2023 4:07 PM

CWC 2023: Pat Cummins Comments After Terrific Win Against Afghanistan - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు)  ఆడి, తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఓటమి కొరల్లో (91/7) చిక్కుకున్న జట్టును మాక్సీ ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా కీర్తించబడుతుంది. ఛేదనలో ఇలాంటి ఇన్నింగ్స్‌ చూడలేదని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతుంది.

మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మాక్స్‌వెల్‌ ఓ అద్భుతమని కొనియాడాడు. ఈ విజయం చిరస్మరణీయమని అభివర్ణించాడు. ఈ అనుభూతి వర్ణించలేనిదని అన్నాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఇదో బెంచ్‌ మార్క్‌గా మిగిలిపోనుందని కితాబునిచ్చాడు. ప్రేక్షకులు మైదానాలకు వచ్చేది ఇలాంటి మ్యాచ్‌ల కోసమేనని పేర్కొన్నాడు. ప్రతి క్రికెట్‌ అభిమాని ఈ మ్యాచ్‌ను చిరకాలం గుర్తించుకుంటాడని తెలిపాడు.

క్రీజ్‌లో మాక్సీ చాలా ప్రశాంతంగా, ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలిపాడు. 200 పరుగులు వెనుకబడి, కేవలం 3 వికెట్లు చేతిలో ఉండి ఈ మ్యాచ్‌ను గెలవడం చాలా ప్రత్యేకమని అన్నాడు. గాయంతో బాధపడుతున్న మాక్స్‌వెల్ రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాలనుకున్నాడా అన్న దానిపై స్పందిస్తూ.. మాకు చేతిలో మరో రెండు వికెట్లు ఉన్నాయి. జంపా క్రీజ్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ మాక్సీ రిటైర్డ్‌ అవ్వాలని అనుకోలేదు.

తన జట్టును ఎలాగైనా గెలిపించాలని దృడ సంకల్పంతో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా చివరి దాకా క్రీజ్‌లో ఉండి గెలిపించి చూపించాడు. మేము ఇప్పుడు సెమీఫైనల్‌లో ఉన్నాము. ఇదో గొప్ప అనుభూతి. ఆఫ్ఘన్ల ఆటతీరుపై ఎదురైన ప్రశ్నను కమిన్స్‌ దాటవేశాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఈ జట్టు లీగ్‌ దశలో మరో మ్యాచ్‌లో ఆడాల్సి ఉన్నా, సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడటం ఖాయమైపోయింది. సౌతాఫ్రికా సైతం మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా, ఆ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేదు. రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఏదో ఒక స్థానంలో ఉంటాయి. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌ ఆడటం​ కూడా ఖరారైపోయింది. నాలుగో సెమీస్‌ బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ పోటీపడుతున్నాయి.

చదవండి: చాలా బాధగా ఉంది.. ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము: ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement