Mohammad Shahzad
-
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ విజేత జోబర్గ్ బంగ్లా టైగర్స్
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ రెండో ఎడిషన్ (2024) విజేతగా జోబర్గ్ బంగ్లా టైగర్స్ అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన ఫైనల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్.. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్), కుసాల్ పెరీరా (11 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో నికోల్సన్ గోర్డన్ 2, ఖైస్ అహ్మద్, అమిర్ హమ్జా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మలాన్ (28 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో విరుచుకుపడినప్పటికీ సాంప్ ఆర్మీని గెలిపించలేకపోయాడు. బ్రియాన్ బెన్నెట్ 36, జాక్ టేలర్ 23 (నాటౌట్) పరుగులు చేయగా.. రోహన్ ముస్తఫా డకౌటయ్యాడు. టైగర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన మొహమ్మద్ షెహజాద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పూరన్ సుడిగాలి శతకం -
గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చిన అఫ్గన్ క్రికెటర్.. ఫ్యాన్స్ ఆగ్రహం
అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ గ్రౌండ్లో సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అతని ప్రవర్తనపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో భాగంగా ఫిబ్రవరి 4న మినిస్టర్ గ్రూఫ్ ఢాకా, కొమిల్లా విక్టోరియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇది చోటుచేసుకుంది. మ్యాచ్ కొద్దినిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా.. మైదానంలోకి వచ్చిన మహ్మద్ షెహజాద్ సిగరెట్ కాల్చాడు. అతని నోటి నుంచి సిగరెట్ పొగను వదలడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది చూసిన షెహజాద్ జట్టు కోయ్ మిజానుర్ రెహ్మన్, తమీమ్ ఇక్బాల్‌లు వెంటనే గ్రౌండ్‌కు వచ్చి షెహజాద్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కు తరలించారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం కాగా షెహజాద్ చర్యపై బీసీబీ చీఫ్ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గ్రౌండ్లో స్మోక్ చేయడం నిషేధం. ఆ రూల్ మరిచి షెహజాద్ గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చడం తప్పు. ఒకవేళ షెహజాద్‌కు ఈ విషయం తెలియకపోతే.. మ్యాచ్ అఫీషియల్స్ అతనికి సమాచారం అందించాల్సింది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.20 కింద నిబంధనలు ఉల్లఘించిన కారణంగా షెహజాద్‌కు పెనాల్టీతో పాటు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన మహ్మద్ షెహజాద్ తన ప్రవర్తనపై క్షమాపణ కోరాడు. తాను చేసింది తప్పేనని.. ఫైన్ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఫ్యాన్స్ నాపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం ఉందని పేర్కొన్నాడు. If Shah Rukh Khan could be banned for 5 years due to smoking in the gallery, Or Lankan players could be banned for smoking, not even in the stadium. Then surely this rubbish cricketer from Afghanistan (Mohammad Shahzad) should be banned for a lifetime in the BPL! @BCBtigers @ICC pic.twitter.com/R5jGtCutlY — Foysal Sawon (@foysal_sawon) February 4, 2022 -
మనిషి మాత్రమే బరువు.. ఆట మాత్రం సూపర్ క్లాస్
Mohammad Shahzad complete 2000 T20I Runs.. అప్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అఫ్గన్ తరపున టి20ల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా షెహజాద్ 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. మహ్మద్ షెహజాద్ ఆకారంలో లావుగా కనిపిస్తున్నప్పటికి ఆటలో మాత్రం క్లాస్ కనిపిస్తుంది. అఫ్గన్ ఓపెనర్‌గా షెహజాద్ ఇటీవలే మంచి ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక 2009లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ వికెట్ కీపర్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అఫ్గన్ తరపున షెహజాద్ 2 టెస్టుల్లో 69 పరుగులు.. 84 వన్డేల్లో 2,727 పరుగులు.. 66 టి20ల్లో 2011 పరుగులు సాధించాడు. -
షెహజాద్‌పై ఏడాది నిషేధం
కాబోల్: క్రికెట్ బోర్డు నియమావళిని ఉల్లఘించినందుకు అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్‌పై ఏడాది నిషేధం పడింది. ఇటీవల షెహజాద్‌పై నిరవధిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ).. తాజాగా శిక్షను ఖరారు చేసింది. బోర్డుకు చెప్పకుండా విదేశీ పర్యటనలకు వెళ్లాడనే ఆరోపణలపై షెహజాద్‌పై నిషేధాన్ని విధించింది. తమ దేశ క్రికెటర్ ఎటువంటి బోర్డు అనుమతులు లేకుండా విదేశీ పర్యటన చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఏసీబీ ఈ మేరకు చర్యలకు చేపట్టింది. అదే సమయంలో ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షెహజాద్ ఫిట్‌గా లేడంటూ మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పించింది. దాంతో అఫ్గాన్ బోర్డుపై షెహజాద్ ధ్వజమెత్తాడు. తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ బోర్డు తనను కావాలనే తొలగించిందని, ఇదే తనపై కొంతమంది బోర్డు పెద్దలు కుట్ర చేశారని మండిపడ్డాడు. వీటిని సీరియస్‌గా పరిగణించిన అఫ్గాన్ బోర్డు.. షెహజాద్‌పై ఏడాది నిషేధం విధించింది. ఈ కాలంలో ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకూడదంటూ ఆంక్షల్లో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని బోర్డు స్పష్టం చేసింది. -
షెహజాద్‌ను సస్పెండ్ చేశారు..!
కాబూల్: అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహ్మద్ షెహజాద్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సస్పెండ్ చేసింది. షెహజాద్ పదే పదే బోర్డు నియమాలను ఉల్లఘిస్తున్నాడని అభియోగాలు మోపిన అఫ్గానిస్తాన్ బోర్డు.. నిరవధికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షెహజాద్ ఫిట్‌గా లేడంటూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఫిట్‌గానే ఉన్నప్పటికీ బోర్డు కావాలనే తనపై వేటు వేసిందని షెహజాద్ పేర్కొన్నాడు. తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసేందుకు తమ క్రికెట్ బోర్డులోని కొందరు పెద్దలు కుట్ర పన్నారని విమర్శించాడు. తాజాగా షెహజాద్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బోర్డు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే అతనిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏసీబీ తెలిపింది. గత నెలలో క్రమశిక్షణా నియమావళి సమావేశాలు జరగ్గా అందుకు షెహజాద్ గైర్హాజరీ అయ్యాడని బోర్డు పేర్కొంది. మరొకవైపు బోర్డు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలా పదే పదే బోర్డు నియమాలను పెడ చెవిన పెడుతున్న షెహజాద్‌పై సస్పెన్షనే సరైనదని భావించి ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. -
నాపై కుట్ర చేశారు: క్రికెటర్
కాబూల్: వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఆడకుండా తమ క్రికెట్ బోర్డు కుట్ర పన్నిందని అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ అర్థాంతరంగా జట్టు నుంచి తొలగించారంటూ బోర్డుపై విరుచుకుపడ్డాడు. తాజా వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో వరుస రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఫిట్నెస్ లేదంటూ షెహజాద్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన షెహజాద్.. తనను తప్పించడంలో బోర్డు పెద్దల కుట్ర దాగి ఉందంటూ విమర్శలు చేశాడు. (ఇక్కడ చదవండి: వరల్డ్‌కప్: అఫ్గాన్‌కు షాక్) ‘నన్ను ఎందుకు తొలగించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఫిట్నెస్ సాకుతో నన్ను జట్టు నుంచి తప్పించారు. నాకు మ్యాచ్‌లు ఆడేందుకు సరిపడా ఫిట్నెస్ ఉంది. బోర్డులో కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు.ఇందుకు కేవలం జట్టు మేనేజర్, డాక్టర్, కెప్టెన్లే కారణం. ఇది నన్ను తీవ్రంగా కలిచి వేసింది. మాకు కోచ్ కూడా నన్ను తప్పించిన విషయం తర్వాత కానీ తెలియలేదు. న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు నా ఫిట్నెస్ బాగానే ఉంది. మోకాలి గాయమంటూ చెప్పి మొత్తం టోర్నీ నుంచి తొలగించారు. ఆటగాళ్ల ఎవ్వరికీ కూడా నన్ను తప్పించిన విషయం తెలియదు. ఈ వార్త విని వారంతా షాక్ అయ్యారు’ అని షెహజాద్ తెలిపాడు. -
వరల్డ్‌కప్: అఫ్గాన్‌కు షాక్
లండన్: వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌కు షాక్ తగిలింది. అఫ్గానిస్తాన్ విధ్వంసకర ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అఫ్గాన్ బ్యాటింగ్‌లో కీలక ఆటగాడైన షెహజాద్.. పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అయితే ఆసీస్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆడిన షెహజాద్‌కు గాయం తీవ్రత ఎక్కువ కావడంతో మిగతా టోర్నీకి దూరమయ్యాడు. కాగా, 2015 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న షెహజాద్ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు. అతను అఫ్గాన్ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టాప్ ఆర్డర్లో కీలకమైన ఆటగాడిని కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇక్ర్మ్ అలీకి స్థానం కల్పించారు. అఫ్గాన్ తరఫున ఇక్రమ్ అలీ ఇప్పటివరకు ఆడింది రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లే కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అరంగేట్రం చేశాడు. 2018లో అఫ్గాన్ తరఫున అండర్ 19 ప్రపంచకప్ జట్టులో ఆడిన అనుభవం అతడి సొంతం. ఆ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేశాడు. -
ఆ అవార్డు అఫ్గాన్‌కే: ఐసీసీ
హైదరాబాద్: క్రికెట్లో వినోదానికి మారుపేరు వెస్టిండీస్ జట్టు. వికెట్ తీసినా, సిక్సర్ కొట్టిన, సెంచరీ చేసినా కరేబియన్ ఆటగాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో విండీస్ బౌలర్ ఓష్నే థామస్ అంపైర్‌కు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా పసికూన అఫ్గానిస్తాన్ కూడా విండీస్ బాటలోనే నడుస్తుంది. ఆటతోనే కాకుండా అభిమానులకు తమదైన రీతిలో వినోదాన్ని పంచుతున్నారు అఫ్గాన్ ఆటగాళ్లు. తాజాగా అఫ్గాన్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోనే ఐసీసీ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓవర్‌వెయిట్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ షహజాద్‌తో పాటు యువ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్లు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియోనే ఐసీసీ షేర్ చేస్తూ.. ఒకవేళ ప్రపంచకప్‌లో అత్యంత వినోదాత్మక జట్టు అవార్డు ఇవ్వాల్సివస్తే అది అఫ్గాన్‌కే దక్కుతుందని కామెంట్లో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. -
అచ్చం ధోనిలానే..!
-
అచ్చం ధోనిలానే..!
చట్టోగ్రామ్: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురగ్గా ఉంటాడో అందరికీ విదితమే. ప్రపంచ క్రికెట్లో ధోనిలా ఫీల్డింగ్ చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనికి పెద్ద అభిమాని అయిన అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వికెట్ల వెనుక మెరుపులు మెరిపిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా చిట్టగాంగ్ వికింగ్స్తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్‌ను ఔట్ చేసి తీరు ధోనిని గుర్తు చేసింది. ఈ మ్యాచ్ బుధవార జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నయీమ్ హసన్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి క్రీజ్ బయటకకు వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని హిట్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలిచిన క్రమంలో రెహ్మన్ పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో వికెట్ల వెనుక నుంచి దూసుకొచ్చిన షెహజాద్.. బంతిని అందుకున్న మరుక్షణమే వికెట్లను గిరటేశాడు. బ్యాట్ గాల్లో ఉండగానే స్టంప్స్ పడిపోవడంతో రెహ్మాన్ రనౌట్‌గా నిష్క్రమించక తప్పలేదు. దాంతో వికెట్ల వైపు చూడకుండానే బంతిని నేరుగా స్టంప్స్‌పైకి వేయడంలో దిట్ట అయిన ధోనిని గుర్తు చేసుకోవడం అభిమానుల వంతైంది. -
‘వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరతాం’
హెరాత్: వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్కప్లో్ సెమీ ఫైనల్ చేరే సత్తా తమ జట్టుకు ఉందని అఫ్ఘానిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహ్మద్ షెహజాద్ ధీమా వ్యక్తం చేశాడు. తమదైన రోజున ఎంతటి జట్టునైనా ఓడిస్తామన్న షెహజాద్.. తమ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ‘మా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. దవ్లాత్ జద్రాన్, అప్తాబ్ అలామ్‌లు మా పేస్ బౌలింగ్ బలం. బ్యాటింగ్‌లో సముచిత స్కోరు ఆటగాళ్లున్నారు. ఇక మా స్పిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతో వచ్చే మెగా టోర్నీలో సెమీ ఫైనల్ చేరతామనే నమ్మకం నాకుంది. నా వరకూ అయితే సహజసిద్ధమైన ఆటనే ఆడతా. ప్రధానంగా బంతి లెంగ్త్‌ను చూసే బ్యాటింగ్ చేస్తా. నా జోన్లో ఉన్న బంతిని ఎటువంటి కనికరం లేకుండా హిట్ చేయడమే నాకు తెలుసు. క్రికెట్లో ఎక్కువ అవకాశాలనేవి ఉండవు. మనకు వచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడమే మనం చేయాల్సింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ నా ఆటను కొనసాగిస్తున్నా’ అని షెహజాద్ తెలిపాడు. -
16 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు
షార్జా: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ షెహ్జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు సాధించిన షెహ్జాద్.. 72 పరుగుల్ని ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడంటే అతని సుడిగాలి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు టీ10 లీగ్ రెండో సీజన్లో భాగంగా ఆరంభపు మ్యాచ్‌లోనే షెహ్జాద్ మెరుపులు మెరిపించాడు. సింధిస్ విసిరిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో షెహజాద్, మెకల్లమ్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఒకవైపు మెకల్లమ్ ఆచితూచి ఆడితే, షెహ్జాద్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన షెహ్జాద్.. టీ10లీగ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా నమోదు చేశాడు. షేన్ వాట్సన్ మినహా.. ప్రత్యర్థి జట్టు సింధిస్ 94/6 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సింధిస్ జట్టులో షేన్ వాట్సన్ (20 బంతుల్లో 42 పరుగులు) మాత్రమే ఆకట్టుకోగా, మిగిలినవారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. -
చెలరేగిన షెజాద్.. భారత్ లక్ష్యం 253
దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ 124(116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. షెజాద్‌కు తోడు మహ్మద్ నబీ 64(56 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్‌కు 253 పరుగుల లక్ష్యం నమోదైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు మంచి శుభారంభం అందింది. షెజాద్ వచ్చిరాగానే భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్వే 60 పరుగులు ఉండటం గమనార్హం. అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5)ని బోల్తాకొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0)ల వికెట్లను వరుసగా కోల్పోయింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఓవైపు వికెట్లు పడుతున్న షేజాద్ దాటిగా ఆడుతూ.. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. ఈ తరుణంలో తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న దీపక్ చహర్, నయీబ్(15) వికెట్‌ను పడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీ సైతం ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. కష్టంగా మారిన సెంచరీ హీరో షేజాద్ వికెట్‌ను పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్ పడగొట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జద్రాన్(20)ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. వేగంగా ఆడే క్రమంలో నబీ(64) సైతం క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రషీద్ ఖాన్(12), అలామ్(2)లు వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడటంతో అప్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, చహర్, జాదవ్‌లు తలా ఓ వికెట్ తీశారు. -
సంచలనం: భారత్‌పై అఫ్గాన్ ఓపెనర్ సెంచరీ
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన ఈ అఫ్గాన్ ఓపెనర్ ఫోర్లు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. అనంతరం భారత స్పిన్నర్ల దాటికి అఫ్గాన్ 17 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయినా చెక్కుచెదరని షెజాద్ తన దూకుడు కొనసాగించాడు. 90 పరుగులనంతరం కొంత నెమ్మదిగా ఆడిన ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌పై సెంచరీ సాధించిన తొలి అఫ్గాన్ బ్యాట్స్‌మన్‌గా షెజాద్ గుర్తింపు పొందాడు. -
అఫ్గాన్ దూకుడు.. బ్రేకేసిన బౌలర్లు
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ (56; 43 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికిది వరుసగా రెండో అర్ధశతకం కావడం విశేషం. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్వే 60 పరుగులు ఉండటం గమనార్హం. అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5) బోల్తాకొట్టించాడు. ధోని మార్క్ కీపింగ్‌తో జావెద్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ మిస్.. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. ఇక కుల్దీప్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయ్యింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్‌కు మహేంద్రసింగ్ ధోని సారథిగా వ్యవహరిస్తుండటం విశేషం. మరోవైపు షెజాద్ దాటిగా ఆడుతూ సెంచరీ చేరువగా ఉన్నాడు. -
ఆసియాకప్‌లో ఫిక్సింగ్ కలకలం!
దుబాయ్: ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేగింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ను స్పాట్ ఫిక్సింగ్ చేయమని కొంతమంది బుకీలు కలిశారు. ఈ విషయాన్ని షహజాద్.. టీమ్ మేనేజ్మెంట్కు తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) యాంటీ కరెప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది. వచ్చే నెల్లో షార్జాలో జరుగనున్న అఫ్గాన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్జాద్ తెలిపాడు. దీనిపై అలెక్స్ మార్షల్ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. ‘షహజాద్‌ను ఫిక్పింగ్‌కు పాల్పడమని కొంతమంది కలిసిన ఘటన వెలుగు చూసింది. అది అఫ్గాన్ టీ20 లీగ్‌లో ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు ప్రేరేపించారు. కాగా, దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది’ అని మార్షల్ తెలిపారు. -
కోహ్లిలా సిక్సర్లు కొట్టగలుగుతున్నప్పుడు...
న్యూఢిల్లీ: మొహమ్మద్ షహజాద్ అఫ్గానిస్తాన్ క్రికెటర్. చూసేందుకు దిట్టంగా కనపడినా... ఆడేందుకు బాగానే ఉంటాడు. అదేంటో మరి ఓ ఆటగాడికి ఉండాల్సిన ఫిట్నెస్ తాలుకూ లక్షణాలేవీ అతని రూపురేఖల్లో కనపడవు. ఎందుకంటే ఎత్తులో ఆరడుగులైనా (5.8) లేని షహజాద్ బరువులో ఏకంగా 90 కేజీలకు మించిపోయాడు. మంచి భోజనప్రియుడైన ఈ 30 ఏళ్ల బ్యాట్స్‌మన్ 2009 నుంచి అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంత లావెక్కినా... తన ఫిట్నెస్ను తాను సమర్థించుకుంటున్నాడు. ‘చూడండి నేను ఫిట్నెస్ కోసం కష్టపడతాను. బాగా తినేందుకు ఇష్టపడతాను. కానీ కోహ్లికున్న ఫిట్నెస్ మాత్రం నాకు ఉండదు. అయితే మైదానంలో అతనిలా భారీ సిక్సర్ కొట్టే సత్తా నాకుంది. అలాంటప్పుడు కోహ్లిలా నోరు కట్టేసుకొని మరీ డైటింగ్ చేయాల్సిన అవసరమేముంది. మా కోచ్ (ఫిల్ సిమన్స్)కు నా గురించి బాగా తెలుసు. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలననే నమ్మకం ఉంది. నా శరీర బరువు నాకెప్పుడు సమస్య కాలేదు’ అని షహజాద్ అన్నాడు. భారత జట్టులో ధోని, సురేశ్ రైనా, ధావన్‌లు తనకు మంచి మిత్రులని అతను చెప్పుకొచ్చాడు. ధోని తరహాలో హెలికాప్టర్ షాట్లు కొట్టే షహజాద్ ఏడాది డోపింగ్ నిషేధం తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చి ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. -
‘కోహ్లి కన్నా భారీ సిక్స్ కొట్టగలను’
కాబుల్ : క్రికెటరంటేనే ఫిట్‌గా ఉండటానికి ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూ.. అచ్చం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలా ఉండాలి. కానీ ఆడే సత్తా ఉంటే ఫిట్నెస్తో పనిలేదంటున్నాడు అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షాజాద్. ఏకంగా 90 కేజీల బరువున్న ఈ ఆటగాడు వికెట్ల వెనుక కీపర్‌గా.. అఫ్గాన్ కీలక బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టైటిల్‌ను అఫ్గనిస్తాన్ నెగ్గడంలో షాజాద్ కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలా ఫిట్నెస్ సాధించడానికి తాను చాలా ప్రయత్నం చేశానని, తిండిని అదుపులో ఉంచుకోవడం తనవల్ల కాలేదన్నాడు. అఫ్గాన్ శరణార్థుల క్యాంప్‌లో మాట్లాడుతూ.. తన బరువు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు కోహ్లిలా ఉండాలంటే కష్టమని చెప్పుకొచ్చాడు. ‘ నేను కోహ్లి కన్నా భారీ సిక్స్ కొట్టగలను. నేనేందుకు అతని డైట్ పాటించాలని’ షాజాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలనని తమ కోచ్ సిమన్స్కు తెలుసని పేర్కొన్నాడు. ధోని అత్యంత సన్నిహిత మిత్రుడు ఇక భారత్‌లో ఎక్కువగా గడిపే షాజాద్ టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని అత్యంత సన్నిహిత మిత్రుడని, సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లతో ఎప్పుడు టచ్‌లో ఉంటానని తెలిపాడు. భారత్‌తో మూడు సార్లు ఆడానని, ఆ సమయంలో ధోనితో కొద్దిసేపు ముచ్చటించినట్లు గుర్తు చేసుకున్నాడు. తాము క్రికెట్, వికెట్ కీపింగ్ గురించి కాకుండా సాధారణ విషయాలు మాట్లాడుకున్నామని ఈ అఫ్గాన్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఇక శిఖర్, సురేశ్ రైనాలు నిబద్ధత కలిగిన ఆటగాళ్లన్నాడు. తాను ధోనిలా హిట్చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఈ అఫ్గాన్ క్రికెటర్ బరువు తగ్గేందుకు నిషేదిత హైడ్రోక్సికట్ అనే ఉత్ర్పేరకాన్ని వాడటంతో ఐసీసీ 11నెలల పాటు నిషేధం విధించింది. ప్రపంచకప్ క్వాలిఫైర్ టోర్నీ జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మైదానాన్ని దెబ్బతినేలా ప్రవర్తించడంతో షాజాద్‌పై రెండు మ్యాచ్‌లు నిషేధం విధించారు. ఇక టీ20ల్లో అధిక పరుగులు సాధించిన జాబితాలో షాజాద్ 1816 పరుగులతో 8వ స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్ క్వాలిఫైర్ టోర్నీ ఫైనల్లో వెస్టిండీస్‌పై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. -
‘ఒక్క శాతం చాన్స్‌తోనే వరల్డ్ కప్‌కు’
హరారే: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌కు తమ జట్టు అర్హత సాధించడంపై అఫ్గానిస్తాన్ ఆటగాడు మహ్మద్ షెహ్జాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు తమ జట్టుకు దాదాపు అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో క్వాలిఫై కావడం నిజంగా అద్భుతమేనన్నాడు. తమకున్న ఒక్క శాతం చాన్స్‌తోనే వరల్డ్ కప్‌కు అర్హత సాధించామని షెహజాద్ స్సష్టం చేశాడు. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు. 'ఒక్కశాతం చాన్స్‌తోనే వరల్డ్ కప్‌కు అర్హత సాధించామనేది కాదనలేని వాస్తవం. ఇప్పటికీ మా జట్టు క్వాలిఫై అయ్యిందంటే నమ్మలేకుండా ఉన్నాం. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణ. లీగ్‌లో నేపాల్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం, ఆపై హాంకాంగ్‌ను నేపాల్ ఓడించడం మాకు సూపర్ సిక్స్ అర్హత లభించింది. ఇక జింబాబ్వేను యూఏఈ ఓడించడంతో ఐర్లాండ్‌తో తమ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి వరల్డ్ కప్‌కు అర్హత సాధించాం. పది జట్లు తలపడిన క్వాలిఫయింగ్ టోర్నీలో రెండు జట్లకు మాత్రమే అవకాశం ఉండగా, అందులో మా జట్టు ఉండటం చాలా ఆనందంగా ఉంది' అని షెహజాద్ తెలిపాడు. -
క్రికెటర్ షాజాద్‌పై ఏడాది నిషేధం
దుబాయ్: ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మొహ్మద్ షాజాద్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. దాంతో అతనిపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. తనకు తెలియకుండానే హైడ్రోక్సికట్ అనే ఉత్ర్పేరకాన్ని బరువు తగ్గేందు కు తీసుకున్నట్లు అంగీకరించాడని ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది జనవరి 17న డోపింగ్ టెస్టుకు తన మూత్రం శాంపిల్ ఇచ్చినపుడు అతడు నిషేధిత ఉత్ర్పేరకం క్లెన్బుటెరాల్ సేవించినట్టు వెల్లడైంది. క్లెన్బుటెరాల్ స్టెరాయిడ్‌గా పేర్కొనే ఈ ఉత్పేరకం వాడకంపై వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నిషేధించింది. నిబంధనల ప్రకారం అతనిపై నిషేధం విధించినట్టు ఐసీసీ వెల్లడించింది. షాజాద్ 58 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లలో అఫ్ఘానిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతనిపై నిషేధం వచ్చే జనవరి 17న ముగియనున్నట్టు ఐసీసీ తెలిపింది. దాదాపు 11 నెలల కాలం నుంచి షాజాద్‌పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో అతను తిరిగి క్రికెట్ ఆడతాడని ఐసీసీ పేర్కొంది. -
కోహ్లిని దాటేశాడు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్వంటీ 20ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగుల ఘనతను అఫ్గనిస్తాన్ క్రికెటర్ మొహ్మద్ షహజాద్ తాజాగా అధిగమించాడు. ఇప్పటివరకూ 48 ట్వంటీ 20 మ్యాచ్ ల్లో 1709 పరుగులు సాధించి నాల్గో స్థానంలో ఉన్న కోహ్లిని షెహజాద్ వెనక్కునెట్టాడు. ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ లో షహజాద్ 72 పరుగులు సాధించి సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లిని అధిగమించి ముందు వరుసలోకి వచ్చాడు. తద్వారా షహజాద్ నాల్గో స్థానాన్ని కైవసం చేసుకోగా, కోహ్లి ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. 2010-17 నుంచి ఇప్పటివరకూ చూస్తే షహజాద్ 58 మ్యాచ్‌ల్లో 32.38 సగటుతో 1779 పరుగులు చేశాడు. ప్రస్తుతం ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉన్న షహజాద్.. అఫ్గన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరొకవైపు ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా లో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తొలి స్థానంలో ఉన్నాడు. తన ట్వంటీ 20 కెరీర్ లో మెకల్లమ్ 71 మ్యాచ్ ల్లో 2,140 పరుగులు చేశాడు. ఆ తరువాత స్థానాల్లో శ్రీలంక క్రికెటర్ దిల్షాన్(1889), మార్టిన్ గప్టిల్(1806)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇది అఫ్గన్ కు వరుసగా పదకొండో ట్వంటీ 20 విజయం. దాంతో ట్వంటీ 20 ఫార్మాట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన రికార్డును అఫ్గన్ మరోసారి సవరించుకుంది. గతంలో ట్వంటీ 20 ఫార్మాట్ లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు వరుస ఎనిమిది విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.