మహ్మద్ షాజాద్ (ఫైల్ ఫొటో)
కాబుల్ : క్రికెటరంటేనే ఫిట్‌గా ఉండటానికి ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూ.. అచ్చం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలా ఉండాలి. కానీ ఆడే సత్తా ఉంటే ఫిట్‌నెస్‌తో పనిలేదంటున్నాడు అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షాజాద్. ఏకంగా 90 కేజీల బరువున్న ఈ ఆటగాడు వికెట్ల వెనుక కీపర్‌గా.. అఫ్గాన్ కీలక బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టైటిల్‌ను అఫ్గనిస్తాన్ నెగ్గడంలో షాజాద్ కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలా ఫిట్‌నెస్ సాధించడానికి తాను చాలా ప్రయత్నం చేశానని, తిండిని అదుపులో ఉంచుకోవడం తనవల్ల కాలేదన్నాడు. అఫ్గాన్ శరణార్థుల క్యాంప్‌లో మాట్లాడుతూ.. తన బరువు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు కోహ్లిలా ఉండాలంటే కష్టమని చెప్పుకొచ్చాడు. ‘ నేను కోహ్లి కన్నా భారీ సిక్స్ కొట్టగలను. నేనేందుకు అతని డైట్ పాటించాలని’ షాజాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలనని తమ కోచ్ సిమన్స్‌కు తెలుసని పేర్కొన్నాడు.
ధోని అత్యంత సన్నిహిత మిత్రుడు
ఇక భారత్‌లో ఎక్కువగా గడిపే షాజాద్ టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని అత్యంత సన్నిహిత మిత్రుడని, సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లతో ఎప్పుడు టచ్‌లో ఉంటానని తెలిపాడు. భారత్‌తో మూడు సార్లు ఆడానని, ఆ సమయంలో ధోనితో కొద్దిసేపు ముచ్చటించినట్లు గుర్తు చేసుకున్నాడు. తాము క్రికెట్, వికెట్ కీపింగ్ గురించి కాకుండా సాధారణ విషయాలు మాట్లాడుకున్నామని ఈ అఫ్గాన్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఇక శిఖర్, సురేశ్ రైనాలు నిబద్ధత కలిగిన ఆటగాళ్లన్నాడు. తాను ధోనిలా హిట్‌చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.
ఈ అఫ్గాన్ క్రికెటర్ బరువు తగ్గేందుకు నిషేదిత హైడ్రోక్సికట్ అనే ఉత్ర్పేరకాన్ని వాడటంతో ఐసీసీ 11నెలల పాటు నిషేధం విధించింది. ప్రపంచకప్ క్వాలిఫైర్ టోర్నీ జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మైదానాన్ని దెబ్బతినేలా ప్రవర్తించడంతో షాజాద్‌పై రెండు మ్యాచ్‌లు నిషేధం విధించారు. ఇక టీ20ల్లో అధిక పరుగులు సాధించిన జాబితాలో షాజాద్ 1816 పరుగులతో 8వ స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్ క్వాలిఫైర్ టోర్నీ ఫైనల్లో వెస్టిండీస్‌పై అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment