కొలిన్‌ మున్రో విధ్వంసం.. ఉస్మాన్‌ ఖాన్‌ మెరుపు శతకం వృధా | PSL 2024: Islamabad United Defeated Multan Sultans By 3 Wickets, Check Full Score Details Inside - Sakshi
Sakshi News home page

PSL 2024: కొలిన్‌ మున్రో విధ్వంసం.. ఉస్మాన్‌ ఖాన్‌ మెరుపు శతకం వృధా

Published Sun, Mar 10 2024 7:33 PM

PSL 2024: Islamabad United Defeated Multan Sultans By 3 Wickets - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్‌ చివరి బంతికి విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ చేసిన స్కోర్‌ సీజన్‌ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్‌.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జల్మీ ఇదివరకే నాకౌట్‌ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్‌ ఖలందర్స్‌ లీగ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత.. 
 ఈ మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఆటగాడు ఉస్మాన్‌ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్‌ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్‌ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. 

ఉస్మాన్‌తో పాటు జాన్సన్‌ చార్లెస్‌ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్‌ ఖాన్‌ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 

మున్రో విధ్వంసం..
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్‌.. కొలిన్‌ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్‌ ఖాన్‌ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్‌ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్‌, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. 


 

Advertisement
Advertisement