బెంగళూరు గెలిచింది | RCB Defeated Mumbai Indians By 11 Runs In The Last League Match, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

బెంగళూరు గెలిచింది

Published Wed, Mar 12 2025 3:43 AM | Last Updated on Wed, Mar 12 2025 9:05 AM

RCB defeated Mumbai Indians by 11 runs in the last league match

ఆఖరి పోరులో 11 పరుగులతో ఓడిన ముంబై  

చెలరేగిన స్మృతి, పెరీ, జార్జియా 

అగ్రస్థానంతో నేరుగా ఫైనల్‌కు ఢిల్లీ  

రేపు ముంబై, గుజరాత్‌ల మధ్య ప్లేఆఫ్స్‌ పోరు 

ముంబై: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్‌ జెయింట్స్‌తో ‘ప్లేఆఫ్‌’ మ్యాచ్‌ ఆడనుంది. 

వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్‌సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడో సీజన్‌లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్‌రేట్‌తో క్యాపిటల్స్‌ ముందంజ వేసింది.  2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్‌ చేరినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది.  

మంగళవారం జరిగిన పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్‌ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. 

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్నేహ్‌ రాణా (3/26) మూడు... కిమ్‌ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు.  

అందరూ ధాటిగా...  
బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌స్మృతి ఓపెనింగ్‌ వికెట్‌కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్‌ మంధానకు జతయిన ఎలీస్‌ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. 

స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్‌ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలిలో  దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్‌హామ్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) డెత్‌ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

రాణించిన నాట్‌ సివర్‌ 
ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌ (19), అమెలియా కెర్‌ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్‌ సివర్‌ బ్రంట్‌ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ (20; 2 ఫోర్లు), అమన్‌జోత్‌ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్‌ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్‌ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్‌ 26; స్మృతి (సి) షబి్నమ్‌ (బి) అమెలియా 53; ఎలీస్‌ పెరీ నాటౌట్‌ 49; రిచా ఘోష్‌ (సి) నాట్‌ సివర్‌ (బి) హేలీ మాథ్యూస్‌ 36; జార్జియా నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. 
బౌలింగ్‌: షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 4–0–41–0, నాట్‌ సివర్‌ 2–0–16–0, హేలీ మాథ్యూస్‌ 4–0–37–2, అమన్‌జోత్‌ 4–0–27–0, అమెలియా కెర్‌ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, 
పారుణిక సిసోడియా 2–0–24–0. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) గ్రాహమ్‌ (బి) స్నేహ్‌ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్‌ రాణా 9; నాట్‌ సీవర్‌ (సి అండ్‌ బి) పెరీ 69; హర్మన్‌ప్రీత్‌ (సి) రిచా ఘోష్‌ (బి) కిమ్‌ గార్త్‌ 20; అమన్‌జోత్‌ (బి) గ్రాహమ్‌ 17; యస్తిక భాటియా (సి అండ్‌ బి) స్నేహ్‌ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్‌ గార్త్‌ 10; షబ్నిమ్‌ నాటౌట్‌ 4; పారుణిక నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్‌: కిమ్‌ గార్త్‌ 4–0–33–2, ఎలీస్‌ పెరీ 4–0–53–2, స్నేహ్‌ రాణా 4–0–26–3, హిథెర్‌ గ్రాహమ్‌ 4–0–47–1, జార్జియా వేర్‌హామ్‌ 4–0–29–1. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement