
యూపీతో తలపడనున్న బెంగళూరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఘనవిజయంతో సీజన్‌లో బోణీ కొట్టిన యూపీ వారియర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సోమవారం చిన్నస్వామి స్టేడియంలో తలపడుతుంది. సొంత అభిమానుల మద్దతు మధ్య జరుగనున్న పోరులో సత్తా చాటాలని స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ భావిస్తుంటే... గెలుపు జోరును కొనసాగించాలని యూపీ వారియర్స్ చూస్తోంది.
తాజా సీజన్‌లో ఆర్‌సీబీ మూడు మ్యాచ్‌లాడి 2 విజయాలు, 1 పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ వారియర్స్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, 2 పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. స్మృతి, డానీ వ్యాట్, ఎలీస్ పెర్రీ, రాఘవి బిస్త్, రిచా, కనిక, జార్జియాతో కూడిన ఆర్‌సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్మృతి సూపర్ ఫామ్ ఆ జట్టుకు కలిసి రానుంది.
స్మృతి ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో (అంతర్జాతీయ, డబ్ల్యూపీఎల్ కలిపి) 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్‌లో రేణుక, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్ జోషిత కీలకం కానున్నారు. మరోవైపు దీప్తి శర్మ సారథ్యంలోని యూపీ వారియర్స్ జట్టులో నిలకడ లోపించింది. కెప్టెన్ దీప్తి శర్మతో పాటు కిరణ్ నవగిరె, వృందా దినేశ్, తాలియా మెక్‌గ్రాత్, శ్వేత సెహ్రావత్, గ్రేస్ హ్యారిస్, ఉమ ఛెత్రి కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది.
గత మ్యాచ్‌లో భీకర హిట్టింగ్‌తో విజృంభించిన షినెల్ హెన్రీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో యువ మీడియం పేసర్ క్రాంతి గౌడ్‌తో పాటు స్పిన్నర్ గ్రేస్ హ్యారిస్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న బెంగళూరుపై పైచేయి సాధించాలంటే యూపీ వారియర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment