నోరు అదుపులో పెట్టుకోండి గవాస్కర్‌ సాబ్‌: ఇంజమామ్ | Pakistan Great Attacks Sunil Gavaskar Over India B Team Remark | Sakshi
Sakshi News home page

నోరు అదుపులో పెట్టుకోండి గవాస్కర్‌ సాబ్‌: ఇంజమామ్

Published Mon, Mar 10 2025 1:51 PM | Last Updated on Mon, Mar 10 2025 3:16 PM

Pakistan Great Attacks Sunil Gavaskar Over India B Team Remark

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌పై ఓట‌మి అనంత‌రం పాకిస్తాన్ జ‌ట్టును లెజెండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్‌-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు. "పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 

పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు.

ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్‌-బి టీమ్‌పై కూడా గెల‌వ‌లేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" అని గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు.

ఇంజమామ్ ఫైర్.. 
తాజాగా గ‌వాస్క‌ర్ వ్యాఖ్య‌ల‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఘూటుగా స్పందించాడు. ఇత‌ర జ‌ట్ల గురుంచి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని ఇంజ‌మామ్ హెచ్చ‌రించాడు. "గ‌వాస్కర్ సాబ్‌.. మీ జ‌ట్టు బాగా ఆడి గెలిచింది. అది నేను కూడా అంగీక‌రిస్తాను. కానీ మా జ‌ట్టు గురించి ఏది ప‌డితే అది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. మా జ‌ట్టు గ‌ణాంకాలు చూసి మాట్లాడండి. షార్జా వేదిక‌గా జ‌రిగిన ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు భ‌య‌ప‌డి మీరు పారిపోలేదా?  మీరు మా కంటే పెద్ద‌వారు.

మిమ్మ‌ల్ని మేము చాలా గౌర‌విస్తాము. కానీ మీరు ఇత‌ర దేశం కోసం అలా త‌క్కువ చేసి మాట్లాడం స‌రికాదు. మీ జ‌ట్టును ఎంత కావాలంటే అంతగా ప్రశంసించే హక్కు మీకు ఉంది. కానీ ఇత‌ర జ‌ట్ల‌ను చుల‌క‌న చేసే మాట్లాడే హ‌క్కు మీకు లేదు. ముందు మా పాకిస్తాన్ గ‌ణాంకాల‌ను చెక్ చేసుకోండి.

మీ వ్యాఖ్య‌లు నన్ను చాలా బాధించాయి. మీరు గొప్ప క్రికెట‌ర్‌, కానీ ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో మీ గౌర‌వాన్ని పోగ‌ట్టుకుంటున్నారు. ఇటువంటి కామెంట్స్ చేసేముందు అత‌డు త‌న నోటిని అదుపులో పెట్టుకోవాలి" అని 24 న్యూస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంజ‌మామ్ మండిప‌డ్డాడు.

పాక్‌దే పై  చేయి..
కాగా వన్డే క్రికెట్‌లో భారత్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు వన్డేల్లో ముఖా ముఖి 136 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు టోర్నీల్లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టికర్పించింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా భారత్‌ నిలిచింది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను భారత్‌ ఎగరేసుకుపోయింది.
చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్‌ శర్మ



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement