శుబ్‌మన్ గిల్(PC: BCCI)
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.
కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్‌గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
టీ20లలో కొత్త జోడీ
కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో తాజా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్‌లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్‌గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
‘టాక్సిక్’ కాంపిటిషన్?
ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్‌మన్ గిల్‌కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్‌ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.
‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.
అతడు బాగా ఆడకూడదనుకోను
ప్రతి మ్యాచ్‌లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్‌మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.
ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్‌లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.
చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్!
Comments
Please login to add a commentAdd a comment