నిప్పులు చెరిగిన సీఎస్‌కే బౌలర్‌ | IND A VS ENGLAND LIONS 2nd TEST: KHALEEL AHMED HAS TAKEN 4 WICKETS IN 4 OVERS | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన సీఎస్‌కే బౌలర్‌

Jun 8 2025 5:47 PM | Updated on Jun 8 2025 6:09 PM

IND A VS ENGLAND LIONS 2nd TEST: KHALEEL AHMED HAS TAKEN 4 WICKETS IN 4 OVERS

ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక​ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఏ బౌలర్‌, సీఎస్‌కే పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ నిప్పులు చెరిగాడు. మూడో రోజు ఆటలో ఖలీల్‌ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టంగా (192/3) ఉన్న లయన్స్‌ మూడో రోజు ఆట తొలి సెషన్‌లోనే కష్టాల్లో పడింది.  

కడపటి వార్తలందే సరికి లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి  265 పరుగులు చేసింది. ఫర్హాన్‌ అహ్మద్‌ 11, జోష్‌ టంగ్‌ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు లయన్స్‌ ఇంకా 83 పరుగులు వెనుకపడి ఉంది.

మూడో రోజు ఆటలో ఖలీల్‌ జోర్డర్‌ కాక్స్‌ (45), జేమ్స్‌ ర్యూ (10), జార్జ్‌ హిల్‌ (0), క్రిస్‌ వోక్స్‌ (5) వికెట్లు తీశాడు. రెండో రోజు 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన ఖలీల్‌.. ఇవాళ ఆట తొలి సెషన్‌లోనే 4 వికెట్లు తీసి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించేందుకు పునాది వేశాడు. ఈ రోజు ఆటలో ఖలీల్‌తో పాటు తుషార్‌ దేశ్‌పాండే కూడా ఓ వికెట్‌ తీశాడు. తుషార్‌.. మ్యాక్స్‌ హోల్డన్‌ను (7) ఔట్‌ చేశాడు.

అంతకుముందు లయన్స్‌ ఆటగాళ్లు టామ్‌ హెయిన్స్‌ (54), ఎమిలియో గే (71) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్‌ మెక్‌కిన్నీ (12) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 4, తుషార్‌ దేశ్‌పాండే 2, అన్షుల్‌ కంబోజ్‌, తనుశ్‌ కోటియన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (116) అద్భుతమైన శతకంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ధృవ్‌ జురెల్‌ (52), కరుణ్‌ నాయర్‌ (40), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34) రాణించారు. యశస్వి జైస్వాల్‌ (17), అభిమన్యు ఈశ్వరన్‌ (11), శార్దూల్‌ ఠాకూర్‌ (19), తనుశ్‌ కోటియన్‌ (15), అన్షుల్‌ కంబోజ్‌ (2), తుషార్‌ దేశ్‌పాండే (11) తక్కువ స్కోర్‌కు ఔటయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement