Day 1: విశాఖలో శతక్కొట్టిన జైస్వాల్‌.. సెహ్వాగ్‌ సరసన | Ind vs Eng, 2nd Test Day 1 Jaiswal Scores Masterful Unbeaten 179 In Vizag | Sakshi
Sakshi News home page

Ind vs Eng 2nd Test Day 1: విశాఖలో శతక్కొట్టిన జైస్వాల్‌.. సెహ్వాగ్‌ సరసన

Published Fri, Feb 2 2024 5:17 PM | Last Updated on Fri, Feb 2 2024 8:30 PM

Ind vs Eng 2nd Test  Day 1 Score Vizag Jaiswal Masterful Unbeaten 179 - Sakshi

Ind vs Eng 2nd Test  Day 1 Score: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో సహచరులు నామామత్రపు స్కోరుకే పరిమితమైన వేళ శతకం బాది జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిసి ‘స్టార్‌ ఆఫ్‌ ది డే’గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

నెమ్మదిగా ఆరంభించి...
యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. కానీ ఇంగ్లండ్‌ అరంగేట్ర బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ మాయాజాలంలో చిక్కుకున్న రోహిత్‌ శర్మ 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

యశస్వి ఆచితూచి నిలకడగా ఆడుతుండగా.. అతడికి తోడైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో గిల్‌(34) వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 

ఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ 27 పరుగులకే పరిమితం కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అరంగేట్ర ప్లేయర్‌ రజత్‌ పాటిదార్‌ 32 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌(27) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌(17) వేగంగా ఆడేందుకు యత్నించి తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు.

సెహ్వాగ్‌ సరసన చోటు
ఇలా ఒక్కో వికెట్‌ పడుతున్నా యశస్వి మాత్రం నిలకడగా ఆడుతూ 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 257 బంతులు ఎదుర్కొన్న ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్‌ 179 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అతడికి తోడుగా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి  336 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌ రెండు వికెట్ల చొప్పున తీయగా.. ఆండర్సన్‌, టామ్‌ హార్లీ ఒక్కో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

విశాఖపట్నం టెస్టులో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి జైస్వాల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో తానూ చోటు దక్కించుకున్నాడు.

టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు
►వీరేంద్ర సెహ్వాగ్‌- 2004లో ముల్తాన్‌లో పాకిస్తాన్‌ మీద- 228 రన్స్‌
►వీరేంద్ర సెహ్వాగ్‌- 2003లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా మీద- 195 రన్స్‌
►వసీం జాఫర్‌- 2007లో కోల్‌కతాలో పాకిస్తాన్‌ మీద- 192 రన్స్‌
►శిఖర్‌ ధావన్‌- 2017లో గాలేలో శ్రీలంక మీద- 190 రన్స్‌
►వీరేంద్ర సెహ్వాగ్‌- గ్రాస్‌ ఇలెట్‌లో వెస్టిండీస్‌ మీద- 180 రన్స్‌
►యశస్వి జైస్వాల్‌- విశాఖపట్నంలో ఇంగ్లండ్‌ మీద- 179 రన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement