![CT 2025 Ind vs Ban: Aakash Chopra Picks India Probable Playing XI Feels If Rohit](/styles/webp/s3/article_images/2025/02/18/rohit.jpg.webp?itok=9lK1Yyzs)
విరాట్ కోహ్లితో రోహిత్ శర్మ
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
పేసర్ల విభాగంలో మాత్రం
జట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.
కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.
ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.
నా ఓటు కుల్దీప్ యాదవ్‌కే
అలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.
అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు.
దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment