‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్‌! | IND vs AUS: Kohli Rohit Sharma Fume At Kuldeep For This Reason Goes Viral | Sakshi
Sakshi News home page

కుల్దీప్‌ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్‌!.. గట్టిగానే తిట్టేశారు!

Published Tue, Mar 4 2025 7:43 PM | Last Updated on Tue, Mar 4 2025 8:01 PM

IND vs AUS: Kohli Rohit Sharma Fume At Kuldeep For This Reason Goes Viral

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. 

ముఖ్యంగా ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. 

అందుకే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.

ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు
‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్‌ యాదవ్‌పై ‘విరాహిత్‌’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్‌తో సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని బాది.. అలెక్స్‌ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్‌ కోసం వెళ్లాడు.

ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్‌ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్‌ చేసుకుని నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌ దగ్గర ఉన్న కుల్దీప్‌ వైపు వేశాడు. అయితే, కుల్దీప్‌ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్‌ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.

అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్‌కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 264 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌
కాగా దుబాయ్‌ వేదికగా ఈ సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భాతర బౌలర్లలో మహ్మద్‌ షమీ(3/48), వరుణ్‌ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

సెమీస్‌లో ఈ నాలుగు
ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ గ్రూప్‌ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాయి. 

ఇక పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లను నాకౌట్‌ చేసి గ్రూప్‌-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరగా.. గ్రూప్‌-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టాయి. భారత్‌- ఆసీస్‌ మంగళవారం దుబాయ్‌ వేదికగా.. సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ లాహోర్‌లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. 

చదవండి: NZ vs PAK: రిజ్వాన్‌, బాబర్‌లపై వేటు.. పాక్‌ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement