
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అదరగొడుతోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడ్డ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
దుబాయ్ వేదికగా సమిష్టిగా రాణించి దాయాదిపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి లీగ్ దశలో భాగంగా చివరగా పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆదివారం తలపడనుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ ఒకే జట్టుతో ఆడింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ అన్నాడు.
షమీ లేకపోయినా
కివీస్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టు గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘షమీకి విశ్రాంతినివ్వాలి. పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా విశ్వాసం రెట్టింపు అయింది. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది.
కాబట్టి దుబాయ్‌లో మరో స్పిన్నర్‌ను అదనంగా తుదిజట్టులో చేర్చుకోవచ్చు. లాహోర్ మాదిరి దుబాయ్ పిచ్ మరీ అంత ఫ్లాట్‌గా కూడా ఏమీ లేదు. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.
అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉన్న కారణంగా షమీ లేకపోయినా పెద్దగా ఆందోళనపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఈ ఒక్క మార్పు చేస్తుంది. షమీని పక్కనపెట్టి మరో స్పిన్నర్‌ను ఆడిస్తుంది’’ అని డారెన్ గాఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.
కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసిన షమీ.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. చీలమండ గాయం తాలుకు నొప్పి తిరగబెట్టడంతో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కాసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు.
ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘టీమిండియా పటిష్టంగా ఉంది. ఇందులో సందేహం లేదు. వన్డేల్లో ఇటీవల ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విధానం అద్బుతంగా అనిపించింది.
టైటిల్ ఫేవరెట్ టీమిండియానే
ఇక ఇండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి టోర్నీలో ఎవరు విజేతగా అవతరిస్తారని అడిగితే మాత్రం నేను టీమిండియానే ఎంచుకుంటాను. బ్యాటింగ్‌లో భారత్ అదరగొడుతోంది.
ప్రపంచస్థాయి బౌలర్, ప్రధాన పేసర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోయినా ఆ ప్రభావం పడకుండా సమిష్టిగా రాణిస్తోంది. అందుకే నా టైటిల్ ఫేవరెట్ టీమిండియానే’’ అని ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ చెప్పుకొచ్చాడు.
కాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లలో టీమిండియా ఒక స్పెషలిస్టు స్పిన్నర్(కుల్దీప్ యాదవ్), ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు(అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా), ఒక పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్(హార్దిక్ పాండ్యా), ఇద్దరు పేసర్ల(హర్షిత్ రాణా, మహ్మద్ షమీ)లతో బరిలోకి దిగింది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లలో భారత తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒరూర్కీ, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్‌మన్, జాకొబ్ డఫీ.
చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment