సాక్షి, అమరావతి : ఆలయాలు, ట్రస్టుల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక నుంచి అగ్ర ప్రాధాన్యం దక్కనుంది. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అలాగే, ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ప్రతిష్టను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది.
‘ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు–ఎండోమెంట్స్ చట్టం–1987’కు సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. సభ్యులు ఈ బిల్లుకు మద్దతిస్తూ ప్రసంగించారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాంతో ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నారు. అదే విధంగా అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు మహిళలకే రిజర్వ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ బిల్లుకు సవరణను కూడా శాసనసభ ఆమోదించింది.
అక్రమాలకు పాల్పడితే ఔటే
ఇక ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని రెండేళ్ల పదవీకాలం కంటే ముందే తొలగించడానికి ఈ బిల్లు ఆమోదం ద్వారా మార్గం సుగమమైంది. ఆలయాలు, ట్రస్టుల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. కాగా, తిరుపతి పట్టణాభివృద్ధి, ప్రాధికార సంస్థ (తుడా) చైర్మన్‌ను టీటీడీలో పదవి రీత్యా సభ్యునిగా నియమించేందుకు చట్టంలో సవరణను సభ ఆమోదించింది.
ఆలయాల ప్రతిష్ట కాపాడటమే లక్ష్యం
సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారికి సామాజిక గౌరవం తీసుకురావాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతం. అందుకే ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో కూడా ఆ వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ఇది ఉపకరిస్తుంది. రెండేళ్ల పదవీకాలం ఉంది కదా అనే ధీమాతో అనుచితంగా ప్రవర్తించే పాలక మండలి సభ్యుల ఆటకట్టిస్తుంది. అలాంటి వారిని పదవుల నుంచి ప్రభుత్వం తొలగించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
– వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి
ఆలయాల ప్రతిష్ట, ఆస్తుల పరిరక్షణకు అవకాశం
దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు, ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు ద్వారా పూర్తి అధికారాలు దక్కుతాయి. ఎవరైనా పాలకమండలి సభ్యుడు అవినీతికి పాల్పడినా.. భక్తులు, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించినా వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. చంద్రబాబు పాలనలో విజయవాడ దుర్గగుడి పాలక మండలిలో ఓ సభ్యురాలు అమ్మవారి చీరలను అమ్ముకున్నారు. మరో సభ్యుడు క్షురకులను దూషించారు. కానీ, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలాంటి వాటిని సహించబోమని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
– మల్లాది విష్ణు, ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్
Comments
Please login to add a commentAdd a comment