సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది.
కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి.
ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.
నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు.
మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం
మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు.
దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు.
ఎన్ని ఇబ్బందులో..
ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు.
కూలీ పనులకు వెళ్తున్నాం
‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’
– సంగాయప్ప అర్చకుడు
నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి
‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment