గోదావరి నది మధ్య కొలువైన మహానందీశ్వర క్షేత్రం దుస్థితి
ఆదాయం లేకపోవడంతో పట్టించుకోని దేవాదాయ శాఖ
పుష్కరాలకు రూ.2 లక్షలు మాత్రమే విదిల్చిన సర్కారు
స్నానఘట్టం నిర్మించి..పడవలు నడపాలని భక్తుల వినతి
పోలవరం : ప్రకృతి అందాలతో అలరారుతూ.. పావన గోదావరి మధ్య వెలసిన చారిత్రక క్షేత్రం మహా నందీశ్వర ఆలయం. పట్టిసీమ శివ క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో.. పోలవరం పంచాయతీ పరిధిలోని రామయ్యపేట వద్ద ఈ దేవళం ఉంది. శ్రీ ఉమాసహిత మహానందీశ్వరుడు, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువయ్యారు. ఈ క్షేత్రానికి చెందిన వందలాది ఎకరాల భూములు సర్కారుపరం కావటంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. తగినంత ఆదాయం లేదనే కారణంతో దేవాదాయ శాఖ అధికారులు ఈ క్షేత్రం వైపు కన్నెత్తి చూడటం లేదు.
నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు వస్తుం టారు. పర్యాటకులు సైతం స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకుంటారు. సినిమా షూటింగ్‌లకు ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయంలోని మూర్తులకు ఒక దశలో ధూపదీప నైవేద్యాలు కూడా కరువయ్యాయి. దాదాపు పదేళ్ల క్రితం శివానందగిరి స్వామి ప్రజలనుంచి సేకరిం చిన విరాళాలతో ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా అన్నసమారాధన చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున, సత్యదేవుని కల్యాణం, మహానందీశ్వర కల్యాణం రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసమారాధన చేస్తున్నారు.
రూ.2 లక్షలు విదిల్చారు
గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ క్షేత్రంలో భక్తులు భోజనాలు చేసేందుకు వీలుగా షెడ్ నిర్మించాలని, మరుగుదొడ్లు కట్టించాలని ఆలయ నిర్వాహకులు, భక్తులు కోరుతున్నారు. ఇందుకోసం రూ.10 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, సర్కారు కేవలం రూ.2 లక్షలు విదిల్చింది. ఆ మొత్తంతో ఆలయానికి రంగులు వేయించాలని సూచించింది. తాము అడిగిందే తక్కువ అని, అయినప్పటికీ ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసి చేతులు దులిపేసుకోవడం అన్యాయమని ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆవేదన చెందుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో గోదావరిలో నీటి ఉధృతి అధికంగా ఉంటుంది.
ఆ సమయంలో ఆల యానికి వెళ్లే రోడ్డు మునిగిపోతుంది. ఈ క్షేత్రం వద్ద గల లంక ప్రాంతంలో భక్తులు స్నానమాచరించేందుకు వీలుగా స్నాన ఘట్టం నిర్మించాల్సి ఉంది. భక్తులు స్నానమాచరించిన అనంతరం మహానందీశ్వర క్షేత్రానికి వెళ్లేందుకు ప్రత్యేక పడవలు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
ఆస్తులన్నీ ప్రభుత్వపరం
మహానందీశ్వర క్షేత్రానికి గతంలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగలూరులో 240 ఎకరాల సాగుభూమి ఉండేది. 1,500 ఎకరాల అటవీ భూమి కూడా ఉండేది. ఇవన్నీ ఎస్టేట్ భూములు కావటంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ కింద ప్రభుత్వం మొత్తం భూములను స్వాధీనం చేసుకుంది. దీనిని ప్రభుత్వ క్షేత్రంగా పరిగణించినప్పటికీ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయలేదు. ఈ క్షేత్రం దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతోంది.
చారిత్రక ఆస్తి.. అభివృద్ధి నాస్తి
Published Thu, Feb 19 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement