
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం దేవుళ్ల డబ్బులనూ ఇతర అవసరాలకు మళ్లించినట్టు కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన 2014–2018 కాలంలో వివిధ ఆలయాలకు చెందిన దేవుళ్ల నిధులను ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లకు ప్రెటోలు ఖర్చుకు.. తమకు నచ్చిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు గ్రాంట్ రూపంలో ఆర్ధిక సహాయం చేసేందుకు మళ్లించినట్టు స్పష్టం చేసింది. రూ.34.07 కోట్ల మేర ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన నిధులకు సంబంధించి రికార్డుల్లో ఎటువంటి వివరాలు లేవని తప్పు పట్టింది.
వందల కోట్ల రూపాయల ఆలయ నిధుల అక్రమాలకు సంబంధించి కాగ్ తన నివేదికలో మొత్తం 16 పేజీలలో వివరించింది. 2014–15 ఆర్ధిక ఏడాది నుంచి 2017–18 ఆర్ధిక ఏడాది మధ్య నాలుగేళ్ల లావాదేవీలకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయ రికార్డులతో పాటు రాష్ట్రంలోని 6 (ఏ) కేటగిరికి చెందిన 13 ప్రముఖ ఆలయాల రికార్డులను కాగ్ అధికారులు తనిఖీ చేసి, ఓ నివేదిక రూపొందించారు. 2018 ఏప్రిల్, జూలై మధ్య కాగ్ ఈ తనిఖీలు నిర్వహించింది. ఈ నివేదికను కాగ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల నిధులను వేద, సంస్కృత సంస్థల ఏర్పాటుకు, సనాతన ధర్మ ప్రచారానికి, అవసరం ఉన్న ఏ ఇతర ఆలయాల కోసమే వినియోగించాలి. అయితే గత ప్రభుత్వం అలా కాకుండా చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.
► తనిఖీలు చేసిన 13 ఆలయాల్లోని ఎనిమిదింటిలో మిగులు నిధులను అధికారులు ఉపయోగించే కార్ల అద్దెలకు, పెట్రోలు ఖర్చుకు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులకు ఉపయోగించారు.
► చిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నప్పుడు వాటి పునరుద్ధరణ, సంరక్షణ, నిర్వహణ కోసం పెద్ద ఆలయాల నుంచి దేవదాయ శాఖ సేకరించిన కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల్లోంచి రూ.12.41 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవన (కమిషనర్ కార్యాలయ) నిర్మాణానికి
వెచి్చంచారు.
ఓ ట్రస్టుకు రూ.10.60 కోట్లు
► భక్తులు వివిధ ఆలయాలకు సమర్పించిన కానుకలను, సీజీఎఫ్ రూపంలో దేవదాయ శాఖ సేకరించిన నిధులతో పాటు మరో రూ.10.60 కోట్లను దేవదాయ శాఖ పర్యవేక్షణలో లేని ఒక ట్రస్టుకు కేటాయించారు.
► ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే ఇలా ఇవ్వకూడదు. పైగా ఆ డబ్బులను ఆ ట్రస్టు దేని కోసం ఖర్చు పెట్టిందన్న వివరాలను అప్పటి ప్రభుత్వం తెలుసుకోలేదు. ఇలా ఆయా ఆలయాల్లో రూ.వందల కోట్లలో నిధులు పక్కదారి పట్టాయి.
భూ అక్రమణలను పట్టించుకోలేదు..
► రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పేరిట 4,53,459 ఎకరాల వ్యవసాయ భూమి, 9,05,374 చదరపు గజాల వ్యవసాయేతర భూమి ఉంది. అందులో 70,091 ఎకరాల (మొత్తంలో 15.46 శాతం) వ్యవసాయ భూమి, 11,131 చదరపు గజాల (మ్తొతం 1.23 శాతం) వ్యవసాయేతర భూమి ఆక్రమణలకు గురైంది.
► కాగ్ తనిఖీ చేసిన ఆలయాల పరిధిలోని ఐదు ఆలయాలకు సంబంధించి 716.10 ఎకరాల వ్యవసాయ భూమి ఆక్రమణలో ఉంది. వాటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక చోట 4.88 ఎకరాల భూమిని విడిపించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా, చర్యలు తీసుకోలేదు.
డిపాజిట్ చేయని బంగారం 68.468 కిలోలు
► ఆలయాల వద్ద దేవుడి అభరణాల రూపంలో ఉన్నవి కాకుండా ఉపయోగించకుండా ఒక్క గ్రాము బంగారం ఉన్నా, బంగారం డిపాజిట్ స్కీంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే నాలుగు ఆలయాల పరిధిలో 68.468 కిలోల బంగారం డిపాజిట్ చేయకుండా లాకర్‌లో ఉంచారు.
► ఆయా ఆలయాల పరిధిలోని దుకాణాలకు సంబంధించి రూ.18.48 కోట్ల లీజు బకాయిలు వసూలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment