ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం | CM YS Jagan Mohan Reddy Participated In Ugadi celebrations | Sakshi
Sakshi News home page

ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం

Published Wed, Apr 14 2021 2:09 AM | Last Updated on Wed, Apr 14 2021 8:48 AM

CM YS Jagan Mohan Reddy Participated In Ugadi celebrations - Sakshi

సిద్ధాంతి నుంచి ఉగాది పచ్చడి స్వీకరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి వెలంపల్లి

ప్లవ అంటే ఒక నావ అని అర్థం. 
ఈ సంవత్సరం బాగుంటుందని సిద్ధాంతి కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్‌పై జరిపే యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిçస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరిగి ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన పండుగ కార్యక్రమంలో సీఎం జగన్‌ సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ సందర్భంగా సోమయాజుల పంచాంగ పఠనాన్ని సీఎం జగన్‌ ఆసాంతం ఆలకించారు. అనంతరం సిద్ధాంతి అందజేసిన ఉగాది పచ్చడి స్వీకరించారు. అనంతరం సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్‌కు స్వామి వారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించింది. ఉగాది పండుగ సందర్భంగా శారదా పీఠం పంపిన శేషవస్త్రాలను పండితులు సీఎం జగన్‌కు అందజేశారు. 
ఉగాది సందర్భంగా నూతన పంచాంగం తొలి ప్రతిని సుబ్బరామ సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్, అధికారులు 

ఈ ఏడాది చాలా అనుకూల పరిస్థితులు
సిద్ధాంతి సోమయాజులు ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ పఠనంలో..ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రమంతటా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. పాలన చేసే సీఎం వ్యక్తిగత జాతక రీత్యా  గురువు సంచారంతో చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. పంచాంగ ప్రభావానికి తోడు పరిపాలన చేసే వారి జాతకం బావుండటం మూలంగా గ్రహాలు రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలిస్తాయన్నారు. 
► ఈ ఏడాది మేఘాలు అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షిస్తాయి. వ్యాపారాలకు మంచి అనుకూలత ఉంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. ధన ధాన్యం సమృద్ధిగా చేకూరుతుంది. సుభిక్షం, సంక్షేమం, ఆర్యోగంతో రాష్ట్రమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి. 
► గురు, శుక్రుల ప్రభావంతో మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడంతో పాటు వాటి అమలును దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం, ప్రజలు చక్కటి ఫలితాలతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ సంవత్సరం వాతావరణం సమతూకంగా నడుస్తుంది. 
► గురువు ప్రభావంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూల అవకాశాలు పెరుగుతాయి. రైతులు, రైతు కూలీలు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుకూలత ఉంది.
► ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి. గతేడాది కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అన్ని అనుకూల పరిస్థితులతో ప్రజలందరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి.
► వ్యవస్థాపరంగా ఆర్థిక పరిస్థితులు పుంజుకునే అవకాశం ఉంది. ఆనందంగా ఉన్నామని ప్రతి వారు అనుకునేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఉంది.  
► కరోనాను జయించడమే కాకుండా, ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యం అందేలా ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలంలో అందరి మన్ననలు పొందేలా సీఎం వ్యక్తిగత జాతకం ఉంది. అందరితో స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రం విజయాలు సాధిస్తుంది.

ప్రభుత్వ పథకాల వివరాలతో క్యాలెండర్‌ 
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రూపొందించిన తెలుగు సంవత్సర క్యాలెండర్‌లోనూ ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు. క్యాలెండర్‌ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను ఇచ్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్‌ పింఛన్‌ కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఏనెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు.

వేద పండితులు, అర్చకులకు సీఎం సత్కారం
► ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుతో పాటు పలువురు అర్చకులు, వేద పండితులను సీఎం సత్కరించారు. 
► విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్‌ యాజులు సీఎం జగన్‌ చేతుల మీదగా సత్కారం పొందారు. 
► ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement