పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
► ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నాం. ఈ పథకంలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.
► ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పాము. అర్హత ఉండీ కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవచ్చు.
బీమా ప్రయోజనాలు
► ఈ పథకంతో 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం అందుతుంది.
► 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తారు.
► 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.3 లక్షల సహాయం చేస్తారు.
► 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.
సాక్షి, అమరావతి: ఏ ఒక్క కుటుంబం బాధ పడకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బతకాలని కోరుకునేది మా ప్రభుత్వం అని అన్నారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్ పొందడానికి 15 రోజులు పడుతుందని.. ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారని తెలిపారు. ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నామని అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో బియ్యం కార్డులున్న 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే విధంగా ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి
– ఈ పథకంలో ప్రీమియమ్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకర్లు ఆ నగదును బీమా కంపెనీలకు ప్రీమియమ్‌గా చెల్లిస్తారు.
– ఆ తర్వాత ఒక వారంలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బీమా కార్డులు అందజేస్తారు.
– లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా.. గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్ పాయింట్‌గా ఉంటాయి.
– కంప్యూటర్‌లో బటన్ నొక్కి ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం.. బ్యాంకర్లు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వేర్వేరుగా మొత్తం రూ.510 కోట్ల చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేశారు.
– ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్, కార్మిక ఉపాధి కల్పన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకులు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ పథకంలో లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. గతంలో ఉన్నట్లు కాకుండా ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ 1.41 కోట్ల కుటుంబాలకు మేలు కలిగేలా రూ.510 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment