అన్నను మించిన అండ | CM Jagan deposited above Rs 248 crores to YSR Vahana Mitra beneficiaries | Sakshi
Sakshi News home page

అన్నను మించిన అండ

Published Wed, Jun 16 2021 2:52 AM | Last Updated on Wed, Jun 16 2021 4:14 PM

CM Jagan deposited above Rs 248 crores to YSR Vahana Mitra beneficiaries - Sakshi

వైఎస్సార్‌ వాహన మిత్ర మూడో ఏడాదికి సంబంధించిన చెక్కుతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, నారాయణస్వామి, అధికారులు, లబ్ధిదారులు

సాక్షి, అమరావతి: ‘జగనన్నా.. నాకు సొంత అన్న ఉంటే కూడా ఇంత సాయం చేసి ఉండరు. నాకు అన్న లేరని బాధ పడుతుంటే మీరు వచ్చి ఎంతో సాయం చేసి, ఆ లోటు తీర్చారు. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు మాకు ప్రత్యక్ష దైవం అన్నా..’ అని విశాఖ గాజువాకకు చెందిన మహిళా ఆటో డ్రైవర్‌ పైడిమాత భావోద్వేగంతో పేర్కొన్నారు. మా వెనుక జగనన్న ఉన్నారనే ధీమాతో బతుకుతున్నామని వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన ఆటో డ్రైవర్‌ నాగూరు నాగయ్య, ఒక లీడర్‌ ఎలా ఉండాలో మీరు నిరూపించారని గుంటూరుకు చెందిన మరో ఆటోడ్రైవర్‌ మేడా మురళి శ్రీనివాసరావు ప్రశంసించారు. తమ గురించి ఇదివరకెన్నడూ ఎవరూ ఇంతగా ఆలోచించలేదని కొనియాడారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద మంగళవారం వారు రూ.10 వేలు సాయం అందుకుంటూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం వరుసగా మూడో ఏడాది, కరోనా 
కష్టకాలంలో కూడా ఈ పథకం కింద.. సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ.10 వేల చొప్పున 2.48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, వాహనాలను కండిషన్‌లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే వారు కూడా బాగుండాలని.. మనందరి రాష్ట్రం బాగుండాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, చలానా రూపంలో భారీగా వడ్డించే వారని.. మన ప్రభుత్వం వచ్చాక పన్నులు, అపరాధ రుసుములు గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా 95 శాతం హామీలను అమలు చేశామని చెబితే, 95 అన్యాయాలంటూ అవాస్తవాలతో టీడీపీ పుస్తకం ప్రచురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో ఆటోలపై బాదుడు తగ్గిస్తే.. పెంచామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్నట్లు.. మంచి చేసేవారి మీదే విమర్శలు అడ్డగోలుగా వస్తాయని పేర్కొన్నారు. మన ప్రభుత్వం మానవత్వంతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అన్నకు, తమ్ముడికి తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   
 
ఇచ్చిన మాటకు కట్టుబడి..
– వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో 2018 మే 14న ఒక మాటిచ్చాను. ఆరోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొర పెట్టుకున్నారు.
– ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే దాదాపు రూ.7,500 అవుతుందని చెప్పారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే రిపేర్లు చేయించాలని, అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందన్నారు. ఒకేసారి అంత కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ మేరకు సాయం చేస్తానని ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను.
– ఆ మాట నిలుపుకుంటూ ఈ రోజు మూడో ఏడాది కింద 2,48,468 మంది నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు రూ.248.47 కోట్లు సహాయంగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారా రూ.759 కోట్లు సాయం చేశాం. ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.30 వేల సహాయం అందినట్టవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మరో 42,932 లబ్ధిదారులకు సాయం చేశాం. 

నాడు పన్నుల బాదుడు.. నేడు ఊరట
– గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు చలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. గత ప్రభుత్వంలో 2015–16లో ఆటో నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016 –17లో రూ.9.68 కోట్లు. 2017–18లో రూ.10.19 కోట్లు. అలాగే 2018–19లో రూ.7.09 కోట్లు.
– మన ప్రభుత్వంలో 2019–20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు మాత్రమే. ఇది కూడా కేవలం కాంపౌండింగ్‌ ఫీజు (సీఎఫ్‌)గా వసూలు చేశారు. 2020–21లో రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు. అన్ని అనుమతులు ఉంటే చలాన్లు కట్టే పరిస్థితి ఉండదు. 

ఇది మీ అన్న ప్రభుత్వం
– ఈ రోజు 2.48 లక్షల మందికి అందిస్తున్న సహాయంలో ఎక్కడా, ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేదు. పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాం. ఇది మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం అని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఈ పథకం రాకుండా పోతే  ఎలా ఇవ్వాలి.. అని ఆలోచన చేసే ప్రభుత్వం. ఎలా ఎగరగొట్టాలని అని ఆలోచన చేసే ప్రభుత్వం కాదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. 
– ఇప్పటికీ కూడా ఎవరైనా పొరపాటున మిగిలిపోయుంటే  ఏమాత్రం ఆందోళన చెందవద్దు. ఇంకో నెలపాటు గడువు ఇస్తున్నాను. మీరు అర్హులై ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయండి. వలంటీర్ల సహాయ, సహకారాలు తీసుకోండి. మీకు సహాయం అందేటట్టు చేస్తాను. 
– ఇంకా ఏమైనా సందేహాలుంటే 9154294326 నంబరుకో లేదా 1902 నంబరుకో కాల్‌ చేయండి. ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. వీరు మీకు తోడుగా ఉంటారు. 
– ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె నారాయణస్వామి, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఇతర ఉన్నతాధికారులు, వాహనమిత్ర లబ్ధిదారులు హాజరయ్యారు.
 

మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడం శుభపరిణామం
ఓ వైపు కరోనా కష్టాలతో ఇక్కట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఆటో, టాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 సాయం చేస్తోంది. ఆటోల గిరాకీ తగ్గిన సమయంలో ఈ సాయం వారికి బాగా ఉపకరించింది.  అత్యంత పారదర్శకంగా ఇవాళ 2,48,468 మందికి సాయం చేస్తోంది. వీరిలో 2,17,086 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ఆటో ఓనర్‌ కం డ్రైవర్లు ఉన్నారు. మరో 26,397 మంది కాపు వర్గం వారు ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావడం శుభ పరిణామం. మహిళా డ్రైవర్లు తప్పులు చేయడం లేదని బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు చెబుతున్నారు. అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి చేస్తుంటే టీడీపీ బురద చల్లుతోంది.   
– పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి 

ఇలాంటి పథకం ఎక్కడా లేదు
నవరత్నాలులో భాగం కానప్పటికీ మా శాఖకు 2019లో తొలి సంక్షేమ పథకానికి అవకాశం ఇచ్చారు. ఒక్కో ఆటో, టాక్సీ, మ్యాక్సీ కేబ్‌ ఓనర్‌ కం డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఇవాళ మూడో సంవత్సరం సాయం అందిస్తుండటం సంతోషకరం. వలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు వెళ్లి వాహనంతో పాటు ఫొటో తీసి, పారదర్శకంగా అర్హతను తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో ఉన్న డేటాబేస్‌ క్రాస్‌ చెక్‌ చేసుకుంటూ అప్‌లోడ్‌ చేశారు. దేశం మొత్తం మీద చూస్తే ఇలాంటి పథకం ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో కరోనా వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
– ఎంటీ కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి

ఆడపిల్లగా ఏపీలోనే పుట్టాలన్నా
అన్నా.. మీరు ఇచ్చే రూ.10 వేలు మాకు చాలా పెద్ద విషయం. మా ఆటోవాళ్ల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు సాయం చేస్తున్నారు. మీ పథకాల వల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం. ప్రత్యేకించి మహిళల కోసం మీరు తీసుకుంటున్న చర్యల పట్ల ఆనందంగా ఉంది. దిశ పోలీస్‌ స్టేషన్లు, అభయ యాప్‌ ద్వారా మాకు భద్రత ఉంటోంది. పుడితే ఏపీలో ఆడపిల్లగానే పుట్టాలి అన్నంతగా మీరు శ్రద్ధ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. 
– పైడిమాత, మహిళా ఆటోడ్రైవర్, విశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement