AP: శుభకృత్‌లో అన్నీ శుభాలే | Ugadi 2022: CM Jagan Along Wife Bharati Attend Celebrations Tadepalli | Sakshi
Sakshi News home page

AP: శుభకృత్‌లో అన్నీ శుభాలే

Published Sat, Apr 2 2022 10:57 AM | Last Updated on Sun, Apr 3 2022 8:51 AM

Ugadi 2022: CM Jagan Along Wife Bharati Attend Celebrations Tadepalli - Sakshi

సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న సీఎం జగన్‌ దంపతులు

సాక్షి, అమరావతి: శుభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో సీఎం వైఎస్‌ జగన్, సతీమణి భారతితో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు శుభకృత్‌ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, పంచాంగాలన్నీ ఈ పేరులోనే శుభం అన్న మాట కనిపిస్తోందని చెబుతున్నాయని తెలిపారు.

  
సతీమణి భారతీరెడ్డికి కంకణం కడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో విప్‌ చెవిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు 

ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. క్యాలెండర్లు, పుస్తకాలు ఆవిష్కరించారు. 

సీఎం దంపతులకు ఘన స్వాగతం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.


పంచాంగ శ్రవణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ నుదిటిపై తిలకం దిద్దుతున్న ఆయన సతీమణి వైఎస్‌ భారతి  

ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం దంపతులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నుదిటిపై సతీమణి భారతి తిలకం దిద్దగా, ఆమె నుదిటిపై సీఎం కుంకుమ అద్దడంఅక్కడున్న వారందరినీ ఆకర్షించింది. వేద పండితులు సీఎం చేతికి కంకణ ధారణ చేయగా, భారతి చేతికి సీఎం కంకణ ధారణ చేశారు. అనంతరం వారు వేదం నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు.


వైఎస్‌ భారతి నుదిటిపై తిలకం అద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

క్యాలెండర్ల ఆవిష్కరణ
సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, వ్యవసాయ పంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23, సాంస్కృతిక శాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్‌లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలు జయశ్రీ రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన ‘తెలుగు సాహిత్యం, సమాజం చరిత్ర – రెండువేల సంవత్సరాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ దేవస్థానాలకు  చెందిన వేద పండితులను సీఎం సత్కరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై చిన్నారుల నృత్య రూపకాన్ని తిలకించి, వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్‌.మల్లిఖార్జునరావు రూపొందించిన డీ సెంట్రలైజ్డ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ వైఫ్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్‌ రూపంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సీఎం దంపతులకు శ్రీవారి దశావతార కళారూపం అందజేశారు.


శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగాన్ని సిద్ధాంతి సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

ఉగాది వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్‌ (కమ్యూనికేషన్స్‌), పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజలు హాయిగా ఉంటారు..
సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్లుగానే శుభకృత్‌ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ మంచి పాలన అందిస్తారని సీఎం జగన్‌ను సిద్ధాంతి ఆశీర్వదించారు.


ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు

శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించి, కప్పగన్తు సుబ్బరామ సోమయాజులకు అందజేశారు. అనంతరం ఆయన సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. సిద్ధాంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సత్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు.

ఉట్టిపడిన గ్రామీణ వాతావరణం
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లతో ఒక గ్రామ నమూనా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో ఒక అరుగు మీద సీఎం దంపతులు కూర్చోగా, వారికి ఎదురుగా మరో అరుగుపై సిద్ధాంతి కూర్చొన్నారు. సచివాలయం ఎదురుగా ఆహుతులు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement