సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములన్నింటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేస్తోంది. ఆలయం వారీగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబరులో, ఎంతెంత భూమి ఉంది, తదితర వివరాలను పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. దీని ద్వారా అన్ని ఆలయాల వివరాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 24,669 వరకు ఆలయాలు, సత్రాలు, మఠాలు, ట్రస్టులు ఉన్నాయి. వీటి భూముల వివరాలు ఆలయం లేదా సంస్థల వద్ద ‘43 నెంబరు’ రిజిస్టర్ పేరుతో ఉండే ప్రత్యేక రికార్డుల్లో మాత్రమే ఉండేవి.
ఇటీవల కొన్ని చోట్ల రికార్డుల్లో భూముల వివరాలను ఉండే పేజీలను ప్రత్యేకంగా స్కాన్ చేసి, వాటిని మాత్రం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దేవదాయ శాఖ కమిషనర్ సహా అధికారులకు ఏదైనా సమాచారం కావాలంటే జిల్లా లేదా ఆలయాల ఈవో నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతోపాటు పారదర్శకత లోపించి, పలు చోట్ల ఆలయాల భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దేవుడి భూముల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, శాఖలోని కీలక అధికారులకు ఆలయాల వారీగా భూముల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టింది.
గత నెల రోజులుగా ఈవో స్థాయిలో ఆలయాల భూముల వివరాలు ప్రత్యేక ఫార్మాట్‌లో అన్‌లైన్‌లో నమోదు చేశారు. మాగాణి లేదా మెట్ట లేదా కొండ ప్రాంతం లేదా ఖాళీ స్థలం లేదా చెరువు తదితర కేటగిరితో సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవో స్థాయిలో నమోదు కార్యక్రమాన్ని నిలిపివేశారు. వీటిలో మార్పులు చేసే అధికారం ఇకపై ఈవోలకు ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఏ ఆలయం వివరాలు ఏవైనా మిగిలిపోతే వాటిని నమోదు చేసే అవకాశం దేవదాయ శాఖ జిల్లా అధికారులకు మాత్రమే కల్పించారు.
ఈ ప్రక్రియను కూడా ముగించి.. ఆగస్టు మొదటి వారంలో రికార్డులను సరిపోల్చుకునే ప్రక్రియ చేపడతారు. వారం రోజుల్లో దీనిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల్లో మార్పులకు వీలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఆలయాల భూముల వివరాల్లో మార్పులు చేయాలంటే జిల్లా అధికారులు, ఈవోలు ముందుగా దేవదాయ శాఖ కమిషనర్‌కు స్పష్టమైన కారణాలను తెలియజేసి, ఆయన అనుమతి పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment