
‘‘కొందరికి దేవుడి ప్రసాదమంటే ప్రీతి. మరికొందరికి దేవుడి సొమ్మంటే మహాప్రీతి. దేవుడి కైంకర్యాల నిమిత్తం క్రీ.శ 1365లో అగ్రహారీకులు అప్పగించిన 112 ఎకరాల భూమిని కౌలుదారులు తమ కైంకర్యాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో మూల విరాట్‌కు నిత్యనైవేద్యాలకు కొరత ఏర్పడింది. భూములు సాగు చేసుకుంటూ డబ్బులు పోగేసుకుంటున్న కౌలు రైతులు ‘నేతల’ అండదండలతో ఏయేటికాయేడు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. విలువైన ఆస్తులకు అధిపతి అయిన స్వామికి నేడు చిన్న పూలదండ కావాలన్నా దాతల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి కోరుతాడిపర్రు గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారిది. ’’
సాక్షి, అమరావతి బ్యూరో: కోరుతాడిపర్రు... వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల పరిధిలోని కుగ్రామం. నడిబొడ్డులో రెండు ఆలయాలు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం రంగులతో కనిపిస్తుంటే, పొరుగున శ్రీచెన్నకేశవస్వామి ఆలయం ఇటీవల వరకు దిక్కులేనట్టుండేది. పవిత్రమైన ధ్వజస్తంభం స్థానంలో వెదు రుబొంగు, వెదురు బద్దలతో ‘మేఘనాలు’...గోపురంపై పిచ్చిచెట్లు.. అక్కడక్కడా ఇటుకలు బయటకొచ్చి, శిథిల భవనంలా గోచరించేది. కోరినవారికి వరాలనిచ్చే గర్భగుడిలోని చెన్నకేశవుడు, సుక్షేత్రమైన భూములున్నా, తన ఆలయానికీ దుస్థితి ఏమిటని ప్రశ్నించని మౌనమునిలా ఉండిపోయాడు.
భూములను అనుభవిస్తున్న ఆక్రమణదార్లు, కనీసం నామమ్రాతం కౌలూ చెల్లించడం లేదు. పట్టించుకోని దేవదాయ అధికారులు, వారిని అదుపాజ్ఞల్లో ఉంచిన నాటి పాలకులపైనా కన్నెర్ర చేయనే లేదు. దేవుడి నిస్సహాయతకు గుండెలు కరిగిన భక్తులే చందాలు వేసుకుని «నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఇక్కడ చెన్నకేశవుడి భూములకు ఇప్పటికీ కౌలు వేలం జరపకపోవటం గమనించాల్సిన అంశం. కౌలు ఎగవేతపై అధికారులు కోర్టులో దావా వేశారు. ఆ భూములు తమవేనంటూ అనుభవదార్లు 2005లో హైకోర్టునాశ్రయించారు. దీనిపై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెటిల్‌మెంట్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ (సీసీఎల్) కమిషనర్ ఆ భూములు దేవస్థానంకు చెందినవని నిర్ధారిస్తూ, తీర్పునిచ్చారు.
దేవదాయ అధికారులు 2012 ఫిబ్రవరి 17న 47.15 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకిచ్చేందుకు బహిరంగ వేలం జరిపారు. 35.3 ఎకరాలకు వేలం పూర్తయే సరికి, పూర్వ కౌలుదారులు స్టే తెచ్చారు. దీంతో మిగిలిన 8.53 ఎకరాలకు వేలం నిలిచింది. భూమి స్వాధీనం కోరుతూ పాటదారులు వేసి పిటిషనుపై 2013 జులై 19న స్టేను ఎత్తివేశారు. భూమిలోకి పాటదారులు రాకుండా అడ్డుకోవటం, పోలీసులు బందోబస్తు ఇవ్వకపోవటంతో హైకోర్టులో ధిక్కారం పిటీషను వేశారు. చేసేదిలేక 2014 డిసెంబరులో పోలీసు బందోబస్తుతో పాటదారులకు స్వాధీనం చేయటంతో అప్పటి పైరును కోసుకున్నారు. మిగిలిన 8.53 ఎకరాలకు 2015 జూలై 6న ఆలయ ప్రాంగణంలో వేలంకు దేవదాయ అధికారులు నిర్ణయించారు.
దీనిని అడ్డుకునేందుకు అదేరోజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. వేలాన్ని అడ్డుకునేందుకని టీడీపీ నేతల సలహాతో అమాయకంగా చేసిన ప్రయత్నం వికటించిందనీ, దేవదాయ సిబ్బంది పొరపాటేమీ లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు తేల్చారు. ఎకరం రూ.35 లక్షల విలువచేసే మొత్తం 47.15 ఎకరాల భూములన్నీ పాతసాగుదార్ల చేతుల్లో ఉండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment