
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం సరికొత్త రూపుదాల్చబోతోంది. యాదాద్రి తరహాలో భద్రాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు డిజైన్ సిద్ధమైంది. దీని అంతర్భాగంలోనే శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ వేడుకను జరిపించేలా మండప డిజైన్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రస్తుతం తుదిరూపు సంతరించుకున్న డిజైన్ మేరకు కట్టడాల నిర్మాణానికి రామాలయ చుట్టు పక్కల 65 ఎకరాల భూమి అవసరం.
భద్రాద్రి రామాలయ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌కు చినజీయర్ స్వామి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. సుందర భద్రాద్రికి సీఎం కేసీఆర్ ఆమోదమే తరువాయిగా, వచ్చే నెలలోనే భద్రాచల క్షేత్ర అభివృద్ధికి పునాదిరాయి పడే అవకాశముందని దేవాదాయశాఖ నుంచి ఇక్కడి అధికారులకు సంకేతాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
వెయ్యికాళ్ల మండపంతో ఖ్యాతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేనిరీతిలో భద్రాచలంలో వెయ్యికాళ్ల (శిల్పాలతో చెక్కిన వెయ్యి పిల్లర్లు కలిగిన)మండప నిర్మాణానికి ప్రస్తుత డిజైన్‌లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమిన శ్రీసీతారాముల కల్యాణ వేడుక జరిగే మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీని అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండనుంది. ప్రస్తుత కల్యాణ మండపంలో 35 వేల మంది ఆసీనులై తిలకించే వీలుండగా, సరికొత్త డిజైన్‌తో 80 వేల మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
చూడముచ్చటగా రాములోరి క్షేత్రం..
- భక్తరామదాసు నిర్మించిన గర్భగుడిని యథాతథంగా ఉంచుతారు.
- కొత్తగా రెండు ప్రాకారాల్లో ఆలయ నిర్మాణం డిజైన్.
- నిత్యకల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మార్పు.
- ఆలయం నలువైపుల నుంచి స్వామివారి దర్శనం చేసుకునే వీలు
- ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శిల్పాలు, వీటి గురించి తెలిపేలా నామకరణం.
Comments
Please login to add a commentAdd a comment