
సాక్షి, హైదరాబాద్: ఆయన దేవాదాయ శాఖలో గ్రేడ్–1 కార్యనిర్వహణాధికారి.. 6 సీ కేడర్‌లోని ఓ సాయిబాబా దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి గ్రేడ్–1 స్థాయికి ఎదిగాడు.. విధుల్లో చేరిన దేవాలయంలో ఖాళీల ప్రకారమే పదోన్నతులు పొందాల్సి ఉన్నా పైరవీలతో పెద్ద దేవాలయాలకు బదిలీ అయ్యాడు.. 25 ఏళ్లుగా హైదరాబాద్‌లో పాతుకుపోయి ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల్లో తిష్టవేస్తున్నాడు.. తాజా బదిలీల్లో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన వారు మరో ప్రాంతానికి బదిలీ కావాలన్న నిబంధనను పాతరేసి ఏడాదికి రూ.7 కోట్లకు పైగా ఆదాయం ఉన్న దేవాలయానికి బదిలీ అయ్యాడు.
ఇది ఒక్కరికే పరిమితం కాలేదు. 20 ఏళ్లకు పైబడి నగరంలో పాతుకుపోయిన పలువురు ఈవోలకు కూడా తిరిగి ఇక్కడే పోస్టింగు ఇచ్చారు. వీరు.. ఒకరి స్థానంలోకి మరొకరు వచ్చేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తతంగాన్నంతా ఓ ఉన్నతాధికారి ముందుండి నడిపించాడని.. తాజా బదిలీల్లోనూ ఈయనదే ప్రధాన హస్తమని, బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
బదిలీలున్నా నిబంధనలు సున్నా!
దేవాదాయ శాఖ పరిధిలో ఆరేళ్లుగా కార్యనిర్వహణ అధికారుల బదిలీలు.. పన్నెండేళ్లుగా సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీలు జరగలేదు. దీంతో ఒకేచోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది స్థానిక రాజకీయ నేతలతో మిలాఖత్ అయి దేవుడి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెంటనే బదిలీలు చేపట్టాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జాబితాలు సిద్ధమై రెండు రోజుల క్రితం బదిలీ ఆదేశాలు వెల్లడయ్యాయి. నిబంధనల ప్రకారం ఒకేచోట ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని మరో చోటకు బదిలీ చేయాలి. కానీ.. హైదరాబాద్‌లోని పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల పైరవీతో ఈ నిబంధన మాయమైంది. పరస్పరం కుమ్మక్కయిన కొందరు కార్యనిర్వహణాధికారులు ఒకరి కుర్చీని మరొకరికి ఇచ్చుకునేలా పావులు కదిపారు. దీంతో ఈ అధికారులందరికీ నగరంలోనే పోస్టింగులు వచ్చాయి రూ.8 కోట్ల వార్షికాదాయం ఉన్న దేవాలయానికి డిప్యూటీ కమిషనర్ ఈవోగా ఉండాల్సి ఉన్నా తాజా బదిలీల్లో గ్రేడ్–1 అధికారిని ఈవోగా నియమించారు.
ఐదేళ్ల నిబంధనే ఆయుధంగా..
తమకు కావాల్సిన వారి విషయంలో ఐదేళ్ల నిబంధనను అమలు చేయని అధికారులు.. ఇతరుల విషయంలో దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ అధికారి నల్లగొండకు బదిలీ అవడం.. ఆయన స్థానంలో రావాల్సిన అధికారి 6 నెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో ఇద్దరూ అవగాహనకు వచ్చి ఎక్కడి వారక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ నగరంలో అందరికన్నా ఎక్కువ సర్వీసు ఉన్న మరో అధికారి బదిలీ ఆపేందుకు పరస్పర అవగాహనకు వచ్చిన అధికారుల్లో నగరంలోని వ్యక్తిని మరో జిల్లాకు బదిలీ చేశారు. ఆ ఎక్కువ సర్వీసు ఉన్న అధికారి ఓ అధికారికి ‘కావాల్సినవాడు’ కావటంతో మరో అధికారిని సాగనంపారు.
Comments
Please login to add a commentAdd a comment