రేపటి నుంచి ఆలయ దర్శనం | Temple visit from 8th June in AP | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆలయ దర్శనం

Published Sun, Jun 7 2020 4:59 AM | Last Updated on Sun, Jun 7 2020 5:01 AM

Temple visit from 8th June in AP - Sakshi

సోమవారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం పున:ప్రారంభమౌతున్న సందర్భంగా టీటీడీ అధికారులు అలిపిరి టోల్‌గేట్‌ వద్ద టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. యాత్రికులకు శానిటైజేషన్, థర్మల్‌ స్క్రీనింగ్, సీసీ కెమెరాల ద్వారా తనిఖీలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర నెలలుగా ఆలయాల్లో నిలిచిపోయిన భక్తుల దర్శనాలు సోమవారం (ఈనెల 8) నుంచి పాక్షికంగానూ.. బుధవారం నుంచి పూర్తిస్థాయిలోనూ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఆలయాల ఈఓలను ఆదేశిస్తూ దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్‌ రన్‌ విధానంలో ఆలయం ఉండే ప్రాంతంలోని స్థానికులకు మాత్రమే దర్శనాలకు అనుమతిచ్చి ఆ సమయంలో గుర్తించిన లోటుపాట్లను సరిచేసుకుని పదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతి తెలపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

భక్తులకు సూచనలు.. 
► గంటకు 300 మంది భక్తులకు మించకుండా దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గగుడి వంటి 11 పెద్ద ఆలయాలకు వెళ్లదలిచిన భక్తులు 12 గంటల ముందు తమ పేర్లను ఆలయ ఈఓ ఫోను నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.  
► దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి ఉండాలి. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  
► క్యూలైన్‌ ప్రారంభంలో థర్మల్‌ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే లోపలికి అనుమతించరు.  
► క్యూలైన్‌లోనూ ప్రతిఒక్కరు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. 
► భక్తులు ఆధార్‌ లేదా ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలి. 
► 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు రావొద్దు.
విజయవాడ దుర్గ గుడి దర్శనం క్యూలైన్లలో భక్తులు  భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ చేసిన దృశ్యం 

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. 
► సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దేవాలయాల్లో కొంతకాలం తీర్థ ప్రసాదాల పంపిణీ, శఠగోపం వంటివి ఉండవు. 
► నిత్యాన్నదానాలను కొంతకాలం అమలుచేయవద్దు. 
► ఉ.6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కాలంలో మాత్రమే దర్శనాలకు అనుమతించాలి.  
► కేవలం రెండే రెండు క్యూలైన్ల ద్వారా దర్శనాలకు అనుమతి. ఇందులో ఒకటి ఉచిత దర్శనం క్యూలైన్‌. 
► భక్తులను అంతరాలయం, గర్భగుడిలోనికి మరికొంత కాలం పాటు అనుమతించరు.     
► ఆలయ మండపంలో ఒకే సమయంలో 30 మంది భక్తులకు మించి ఉండకూడదు.  
► ఆలయాల్లో భక్తులకు శానిటైజేషన్‌ ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి.  
► 50 ఏళ్ల పైబడి వయస్సు ఉండి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఆలయ సిబ్బందిని కార్యాలయ వ్యవహారాలకో లేదంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతాలలో విధులకు 
పరిమితం చేయాలి. 

భక్తులూ స్వీయ నియంత్రణ పాటించాలి : మంత్రి వెలంపల్లి 
ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణుతో పాటు ఆ శాఖ అధికారులతో కలిసి మంత్రి శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 8వ తేదీ నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. కేశ ఖండనశాలలు తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు చిన్న పిల్లలను తీసుకురావద్దని మంత్రి కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement