
సాక్షి, అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ రోజు ఉదయం మహిషాసుర మర్ధినిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరీ దేవిగా రెండు అలంకాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలంకరణ మార్చే సమయంలో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు దర్శనం నిలిపివేసే అంశంపై దేవదాయ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలసి ఈ విషయంపై చర్చించారు. దసరాతోపాటు ఒకే రోజు అమ్మవారికి రెండు అలంకారాలు, దర్శనం నిలిపివేత వంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భక్తులు రెండు సార్లు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కేఈ కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే భక్తులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ప్రసాదాలకు అదనంగా అప్పం ప్రసాదంగా భక్తులకు అందజేయాలని నిర్ణయించినట్టు ఈవో కేఈకి వివరించారు.
దసరా ఉత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కదంబం పంపిణీ చేయనున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి అలంకరణ మార్చే సమయంలో దర్శనం నిలిపివేస్తున్న విషయాన్ని సామాన్య భక్తులకు తెలిసేలా విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment