సాక్షి, హైదరాబాద్: గుడుల్లో నిరుపయోగంగా పడి ఉన్న వెండికి బదులుగా బంగారం సేకరించి డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. ప్రధాన ఆలయాల్లో ఉపయోగించకుండా ఉన్న వెండి 8 వేల కిలోలుగా లెక్క తేలింది. ఆర్‌జేసీ కేడర్‌లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ దేవాలయాల్లోనే 4 వేల కిలోలున్నట్టు గుర్తించారు. మూల విరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, పూజాధికాలకు వాడే వెండి, ఆలయ తాపడాలకు ఉన్నది కాకుండా.. భక్తులు కానుకలుగా హుండీలో వేసిన వెండిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
కానుకలుగా వచ్చినవాటిలో ఉపయోగించుకునే వస్తువులుగా ఉన్నది పోను, మిగిలిన ముక్కలకు సంబంధించిన నిల్వలపై లెక్కలు తీశారు. మొత్తం 8 వేల కిలోలుగా ఖరారు చేశారు. ఈ వెండిని స్వచ్ఛమైన (ఫైన్ సిల్వర్) వెండిగా మార్చి, దాని విలువకు సమానమైన బంగారాన్ని పొంది, గోల్డ్ డిపాజిట్ పథకం కింద స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
80 కిలోల వెండికి కిలో బంగారం
దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు భారీగా ఖర్చు వస్తోంది. ఇందుకు ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండిని ఆదాయంగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయాల్లో వెండిని సేకరించి, ఆయా ఆలయాల వారీగానే దాన్ని కరిగించి బంగారంలోకి మార్పిడి చేయించబోతోంది. కనీసం వంద కిలోల వెండి ఉన్న దేవాలయాలనే ఇందుకు గుర్తించింది.
8 వేల కిలోల వెండిని 995 (అంతకంటే మెరుగైన) ఫైన్ సిల్వర్‌గా మార్చేందుకు చర్లపల్లిలోని మింట్‌తో దేవాదాయశాఖ సంప్రదింపులు జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవాలయంతో మింట్‌కు ఇప్పటికే ఒప్పందం ఉంది. అదే పద్ధతిలో తమ దేవాలయాల్లోని వెండిని కూడా కరిగించి, మేలిమిగా మార్చి, దాని విలువకు తగ్గ బంగారు బిస్కెట్లను అందించాలని కోరుతోంది.
ఫైన్ వెండిగా మారిస్తే మొత్తం వెండి నిల్వలో 55 శాతం నుంచి 60 శాతం మాత్రమే మేలిమి వెండి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆ రోజు మార్కెట్‌లో ఉన్న మేలిమి వెండి ధర ఆధారంగా, దానికి సమానమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో పొందాలన్నది ఆలోచన. ఈ లెక్కన 80 కిలోల వెండికి కిలో బంగారం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గోల్డ్ డిపాజిట్ పథకంతో లబ్ధి..
సమకూరిన బంగారాన్ని స్టేట్ బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ పథకంలో ఉంచనున్నారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం వెండికి చేయిస్తున్న బీమా ఖర్చు భారం తొలగిపోతుంది. ఇక స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment