
తూర్పు గోదావరిలో 99,418 చదరపు గజాలు, పశ్చిమ గోదావరిలో 15, 915 చ.గ, కృష్ణాలో 36,366 చ.గ. మేర పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూమి కూడా ఆక్రమణలో ఉంది.
సాక్షి, అమరావతి: లీజుల పేరుతో కొన్ని.. అవేమీ లేకుండానే మరికొన్ని దేవుడి భూములు గత ఐదేళ్లలో పరాధీనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దేవుడి మాన్యాల్లో నాలుగో వంతు ఇప్పుడు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని గుడులు, సత్రాలు, మఠాల ఆధీనంలో 4,09,229.99 ఎకరాలు ఉండగా 1,19,615 ఎకరాలు ఆక్రమణదారుల అధీనంలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విలువైన మరో లక్షన్నర చదరపు గజాల భూమి కూడా ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. దీంతో కోట్ల రూపాయల ఆస్తులున్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోక, పూజారులకు తిండిపెట్టలేని దుస్థితి నెలకొంది.
సహకరించని గత ప్రభుత్వ పెద్దలు
కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో దేవుడి భూముల్లో దాదాపు సగం ఆక్రమణదారుల అధీనంలోకి వెళ్లాయి. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఆలయాల ఈవోలు, దేవదాయ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు గత ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం లేకపోవడంతో ఫలించలేదని అంగీకరిస్తున్నారు. కోర్టు కేసులతో అడ్డుకోవడం, కొన్నిసార్లు తీర్పులు వెలువడిన తర్వాత కూడా సహకరించని ఉదంతాలున్నాయి. కాగా దేవుడి భూముల పరిరక్షణ విషయంలో ఆక్రమణదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూములను విడిపించేందుకు దేవదాయ శాఖ పరిధిలోని ప్రత్యేక కమిటీలో ఐపీఎస్ అధికారిని కూడా నియమించాలనే యోచన ఉంది.
దేవుడి భూముల రిజిస్టర్లన్నీ ఆన్‌లైన్‌లోకి..
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రిజిస్టర్లన్నింటినీ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఆక్రమణలకు గురైన ఆస్తుల సత్వర రికవరీ కోసం దేవదాయ శాఖ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆక్రమణల తొలగింపు, పోలీసు శాఖతో మెరుగైన సమన్వయం, భద్రతపై సలహాల కోసం దేవదాయ శాఖకు ఎస్పీ స్థాయి అధికారిని డిప్యుటేషన్‌పై పంపే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
– ఆజాద్ (దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ – ఎస్టేట్స్)