సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాలో ప్రత్యేక హోదా ఉద్యమం మొదటి నుంచి ఉద్ధృతంగా సాగింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఉద్యమించారు. పోలీసులు అలాంటి వారిపై సీఆర్‌పీసీ 151, బైండోవర్ తదితర సెక్షన్ల కింద దాదాపు 250 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ తదితర సమన్వయ నాయకులున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
2014లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసిన ఉద్యమంలో 45 మంది వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టారు. అదే సమమంలో సీపీఎం నాయకులు 20, సీపీఐ 10, ఎస్‌ఎఫ్‌ఐ 5, ఏఐఎస్‌ఎఫ్ 5 మందిపై కేసులు నమోదు చేశారు. 2016లో జరిగిన రాష్ట్ర బంద్‌లో కూడా 25 మంది వైఎస్‌ఆర్‌సీపీ, 15 మంది సీపీఎం, 10 మంది సీపీఐ, 10 మంది ఏఐవైఎఫ్ వారిపై కేసులు పెట్టారు. 2017లో సీపీఎం ఇచ్చిన బంద్‌లో దాదాపు 80 మందిపై కేసులు పెట్టారు. 2018 ఫిబ్రవరి 22వ తేదీన సీపీఎం కలెక్టరేట్ ముట్టడిలో 20 మందిపై కేసులు నమోదయ్యాయి.
హర్షం వ్యక్తం చేసిన సీపీఐ
ప్రత్యేక హోదా ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేయడంపై సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు పెట్టి వేధించారని, అందుకే ఆయనను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. భవిష్యత్‌లో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రభుత్వం చేసే పోరాటాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, అన్ని పార్టీలకు కలుపుకుని పోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment