కర్నూలు (రాజ్‌విహార్): రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు సామాజిక సాధికార నినాదంతో పులకించింది. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వేలాది ప్రజలు వెంట నడుస్తుండగా, యువత బైక్ ర్యాలీతో పాతబస్తీలో సాధికార వైభవాన్ని చాటింది.
కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ర్యాలీగా వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా కేరింతలు, జై జగన్ నినాదాల హోరుతో యాత్ర సాగింది. ‘మళ్లీ జగనే కావాలి’ అంటూ అశేష జనవాహిని చేస్తున్న నినాదాల మధ్య సభ విజయవంతంగా జరిగింది. సీఎం వైఎస్ జగన్ అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలును నేతలు చెబుతుంటే ప్రజలు నిజమే అంటూ సమాధానం ఇచ్చారు.
సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు
నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో అణగారిన వర్గాల బతుకుల్లో ఎంతో మార్పు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐక్య రాజ్య సమితిలో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారన్నారు. పెత్తందారులకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోందన్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులను అణగారిన వర్గాలు పొందుతున్నారని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు తోడేళ్లు, దొంగల ముఠాల్లా వస్తున్నారని, వారి వలలో పడవద్దని ప్రజలను కోరారు.
బడుగుల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం: కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు
రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి ఒక్క సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికే వెచ్చించారని తెలిపారు. ఇది 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారో చంద్రబాబు సమాధానం ఇవ్వాలన్నారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అండగా నిలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు వేస్తేనే రెండున్నర లక్షలు ఖర్చుచేసిన సీఎం జగన్ మరోసారి ఓటు వేస్తే ఎంత మేలు చేస్తారో అలోచించాలని ప్రజలను కోరారు.
దేశంలో ఇంత మేలు ఎన్నడూ జరగలేదు : మాజీ మంత్రి అనిల్‌కుమార్
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ చేసినంత మేలు ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనార్టీకీ సీఎం జగన్ సంక్షేమాన్ని అందించారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు ఎప్పటికీ మేలు చేయరని చెప్పారు.
సామాజిక కుట్రకు టీడీపీ శ్రీకారం: ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులిచ్చి సమాజంలో గుర్తింపు తెచ్చారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బలహీనులు ఎదగకూడదన్న దురుద్దేశంతో టీడీపీ సామాజిక కుట్రకు తెర లేపిందని, అందరూ దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కర్నూలుకు రూ.2 వేల కోట్లు ఇచ్చిన సీఎం జగన్: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సీఎం జగన్‌కు కర్నూలుపై ప్రత్యేక అభిమానం ఉందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి ఈ నాలుగున్నరేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, అందుకు అందరం ఆయనకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment