
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234 వరకు ఉన్నాయి. వీటిలో 678 ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఉన్నాయి. ట్రస్టు బోర్డుల పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556 ఉన్నాయి.
వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు. ట్రస్టు బోర్డులో ఆలయం స్థాయినిబట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ ట్రస్టు బోర్డుల నియామకం ద్వారా ఐదు వేల మందికి పైనే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
జనరల్ సహా అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకే దక్కనున్నాయి. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలు లేదంటే వంశ పారంపర్య అర్చకులు, లేదా çప్రముఖ హిందూ సంస్థలు వాటి నిర్వహణకు ముందుకొస్తే వారికే అప్పగించేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ట్రస్టు బోర్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది సీఎం జగనే..
ఆలయ ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇంతకు ముందే ప్రత్యేకంగా దేవదాయ శాఖ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ప్రతి ట్రస్టు బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, జనరల్ సహా ఆయా రిజర్వు కేటగిరిల్లో సగం పదవులు తప్పనిసరిగా మహిళలకే కేటాయించేలా జగన్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది.
దీంతోపాటు ఆలయాల కేశ ఖండన శాలల్లో నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రముఖంగా ఉంటే ట్రస్టు బోర్డులోనూ ఆ వర్గం వారిని ఒక సభ్యుడిగా నియమించే వీలు కల్పించారు. అదే సమయంలో ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని వారి పదవీ కాలం కంటే ముందే తొలగించేలా విస్పష్టంగా చట్టాన్ని సవరించారు.
ఈ చట్ట సవరణలు అనంతరం ప్రభుత్వం నియమించిన అన్ని ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇప్పుటి వరకు 4,024 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కింది. 3,787 మంది మహిళలూ ఆయా ట్రస్టు బోర్డుల్లో భాగస్వాములయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు నామ మాత్రపు ప్రాధాన్యత కూడ ఉండేది కాదని అధికారవర్గాలు వివరిస్తున్నాయి.