దేవుడి సేవపై రాజకీయ నిర్ణయం | TTD Priests Associations fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

దేవుడి సేవపై రాజకీయ నిర్ణయం

Published Thu, May 17 2018 4:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

TTD Priests Associations fires on Chandrababu Govt - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అర్చకుల గరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించి నలుగురు ప్రధాన అర్చకులను తొలగించడం వివాదంగా మారింది. ఉద్యోగుల మాదిరిగా కాకుండా హైందవ సంప్రదాయాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి వంశపారంపర్యంగా దేవుడి సేవ విధుల్లో పాల్గొంటున్న వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వం ద్వారా నియమితులైన టీటీడీ పాలకమండలికి ఉందా అన్న చర్చ ప్రారంభమైంది. వంశపారంపర్యంగా అర్చకులు తమకు సంబంధించిన దేవాలయాల్లో ఎంతో పవిత్రతతో ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారని.. అలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం, అధికారులు మితిమీరిన జోక్యం చేసుకోవడం వంటివి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్‌ దేశానికే అరిష్టమని పండితులు, పీఠాధిపతులు పేర్కొంటున్నారు. ఆలయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నిస్తే.. హిందూ సంప్రదాయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడడం లేదని అర్చక సంఘాలు విమర్శిస్తున్నాయి.

అర్చకులకు పదవీ విరమణ వర్తిస్తుందా?
తొలినాళ్లలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు నియమాకాలు గానీ, పదవీ విరమణలు అన్నవే లేవు. ఏ ఆలయంలోనైనా అక్కడి అర్చక కుటుంబాలు వంశపారంపర్యంగా దేవుడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆలయానికి వచ్చే భక్తుల కానుకలతోనే జీవన భృతిని పొందేవారు. 1966లో చేసిన చట్టంలో ఈ మేరకే నిబంధనలు ఉన్నాయి. 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అలయాల అర్చకుల విషయంలో అనేక మార్పులతో ఏపీ దేవాదాయ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై అర్చక కుటుంబాలు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అర్చకుల ప్రత్యేకత దృష్ట్యా 1987 నాటి చట్టానికి సవరణలు చేసుకోవాలంటూ 1997లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా సూచించింది. ఆ తీర్పును అనుసరించి రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో రెండు రకాల నిబంధనల మేరకు అర్చకులు పనిచేస్తున్నారని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. కొన్ని దేవాలయాల్లో అర్చకులు వంశపారంపర్యంగా పనిచేస్తున్నారు.

నియామకం ద్వారా అర్చకత్వంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి బేసిక్, డీఏ, హెచ్‌ఆర్‌ఏతోపాటు పదవీ విరమణ వంటివి ఉంటాయని.. వంశపారంపర్య అర్చకులకు డీఏ, ఇంటి అలవెన్స్‌లేవీ ఉండవని వారు తెలుపుతున్నారు. అయితే, ఆలయ ఆదాయం నుంచి వంశపారంపర్య అర్చకులకూ కొంత వేతనం చెల్లిస్తారు. వీరికి పదవీ విరమణ అంటూ ఉండదు. విధుల్లో ఉన్న వారు స్వచ్చందంగా వైదొలిగితే ఆ కుటుంబంలో మరొకరు ఆ విధుల్లో పాల్గొంటారు. 1966 చట్టం ద్వారా.. అప్పటికి అర్చక విధుల్లో ఉన్న వారి కుటుంబీకులందరినీ వంశపారంపర్యంగా కొనసాగించాలని 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చట్ట సవరణ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపగా.. ధర్మాసనం అంగీకారం తెలిపింది. దాని ప్రకారం తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహణకు ఆమోదం తెలుపుతూ 2010లో అప్పటి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదనంతరం రాష్ట్ర హిందూ మత పెద్దలతో ఏర్పాటు అయిన ధార్మిక పరిషత్‌ దానికి ఆమోదం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టుకు తెలియజేయకుండా వంశపారంపర్య అర్చకుల విషయాల్లో విధానాలు మార్చుకునే వెసులుబాటు లేదని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి.

వేల కోట్ల కోసమేనా ఈ నిర్ణయాలు?
2014 ఎన్నికల సమయంలో దేవదాయ శాఖ పరిధిలోగానీ, టీటీడీలో గానీ వంశపారంపర్యంగా అర్చకత్వ విధుల్లో కొనసాగుతున్న వారిలో ఒక్కరిని తమ ప్రభుత్వం వస్తే తొలగించే నిర్ణయం తీసుకోబోమని చంద్రబాబు హామీ ఇచ్చారని అర్చక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ఆలయాల్లో పనిచేసే వంశపారంపర్య అర్చకులకు రక్షణ కల్పించకపోగా, టీటీడీలో అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన దానిని రద్దు చేయాలని నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement