సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌ను విచారించిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యం దాఖలుకు వెనుక ఉన్న సదుద్దేశాలను నిరూపించుకునేందుకు రూ.27.44 కోట్లు డిపాజిట్ చేయాలని ఆళ్లను ఆదేశించింది.
ఆ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద డిపాజిట్ చేశారు. అటు తరువాత సదావర్తి భూములకు మొదట జరిగిన వేలాన్ని రద్దు చేసిన హైకోర్టు, మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశించింది. తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సదావర్తి భూములు తమవని తమిళనాడు చెప్పడంతో రెండో వేలాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ రాష్ట్రం వాదన విన్న తరువాత వేలంపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కాగా తాను డిపాజిట్ చేసిన మొత్తం వెనక్కి ఇప్పించాలన్న రామకృష్ణారెడ్డి అనుబంధ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది.
27.44 కోట్లు రామకృష్ణారెడ్డికి ఇచ్చేయండి
Published Wed, Nov 1 2017 1:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment