Sadarvati Satram Lands
-
అధికారిణిపై కక్షసాధింపు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా సదావర్తి సత్రం పేరిట చెన్నైకు సమీపంలో ఉన్న భూముల్ని అతి తక్కువ ధరకు కొట్టేయాలన్న అధికారపార్టీ నేతల దోపిడీ కథను అడ్డుకున్న అధికారిణిపై రాష్ట్రప్రభుత్వం వేధింపు చర్యలకు దిగింది. దేవదాయ శాఖ జోన్–2కు రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)గాను, శ్రీకాళహస్తి ఆలయ ఈవోగాను పనిచేస్తున్న భ్రమరాంభను సుమారు 20 రోజులక్రితం ఆయా బాధ్యతల నుంచి బదిలీ చేసింది. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ అంశం దేవదాయ శాఖలో చర్చనీయాంశమైంది. నాడు లేఖాస్త్రంతో కలకలం.. 2016 మార్చిలో సదావర్తి సత్రం పేరిట చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83.11 ఎకరాల భూమికి రాష్ట్రప్రభుత్వం వేలం నిర్వహించడం, ఎకరా కేవలం రూ.27 లక్షల చొప్పున రూ.22.44 కోట్లకే ఆ మొత్తం భూములను కొట్టేయాలని టీడీపీ నేతలు చూడడం తెలిసిందే. అయితే ఆ భూమికి తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధర ప్రకారమే ఎకరా రూ.6 కోట్లు దాకా ఉందంటూ వేలం జరిగిన 20 రోజులకు భ్రమరాంభ దేవదాయశాఖ కమిషనర్ అనురాధకు లేఖ రాశారు. వేలం జరిగిన తీరును కూడా తప్పుపడుతూ.. ఆ భూమి ఎంత ధర ఉందన్నదీ తెలుసుకోకుండా వేలం నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. ఆ భూమి మొత్తం ఆక్రమణలో ఉందని పేర్కొంటూ.. తక్కువ ధరకు వేలం నిర్వహించారని, అయితే 20 నుంచి 30 ఎకరాలు ఖాళీగానే ఉందని వివరించారు. ప్రభుత్వ పెద్దల భూదోపిడీ వ్యవహారంపై ఆ లేఖ పెద్ద కలకలాన్ని సృష్టించింది. అదను చూసి కక్ష సాధింపు.. సదావర్తి సత్రం భూముల విషయంలో దోపిడీ కోణం బహిర్గతమవడంతో రాష్ట్రప్రభుత్వం తీవ్ర అప్రదిష్టల పాలైంది. టీడీపీ నేతల దోపిడీ కోణాన్ని బయటపెట్టిన భ్రమరాంబపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారు. రెండేళ్ల తర్వాత అదను చూసి ఇప్పుడు ఆమెపై వేధింపులకు దిగారు. భ్రమరాంభకు 2023 వరకు సర్వీసు కాలం ఉంది. అయితే ఆమె ఆరునెలలక్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్న యోచనతో ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కొద్దిరోజుల క్రితమే తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం 20 రోజులక్రితం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఆమెను బదిలీ చేసి.. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. అప్పట్నుంచీ పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఆమెను ఇబ్బందులపాలు చేస్తోంది. దేవదాయశాఖలో ఆర్జేసీ అధికారులు బాధ్యతలు నిర్వహించే 8 పెద్ద ఆలయాల ఈవో పోస్టులతోపాటు రెండు రీజనల్ కమిషనర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం ఆ శాఖలో నలుగురే ఆర్జేసీ అధికారులున్నారు. మిగిలిన పోస్టుల్లో రెవెన్యూ అధికారులను డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు. భ్రమరాంభను బదిలీ చేసిన ఈ 20 రోజుల వ్యవధిలోనే రెవెన్యూ అధికారులను ఆయా పోస్టుల్లో డిప్యుటేషన్‌పై నియమించిన సర్కారు.. ఆమెకు మాత్రం ఏ పోస్టింగ్ ఇవ్వకపోవడం కక్ష సాధింపునకు నిదర్శనం. -
‘మా పరిధిలో లేని విషయం’
సాక్షి, హైదరాబాద్: అత్యంత వివాదాస్పదమైన సదావర్తి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ వివాదాన్ని తమిళనాడు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వద్ద తేల్చు కోవాలని సూచించింది. సదావర్తి భూములపై తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న 83 ఎకరాల భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం వాటి ల్లిందని.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో గతేడాది పిల్ దాఖలు చేశారు. అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఇదిలా ఉండగానే వేలం వేసిన సదావర్తి సత్రం భూముల్లో తమ భూములున్నాయంటూ కొందరు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం సదావర్తి భూములు తమవేనంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారించింది. -
27.44 కోట్లు రామకృష్ణారెడ్డికి ఇచ్చేయండి
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌ను విచారించిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యం దాఖలుకు వెనుక ఉన్న సదుద్దేశాలను నిరూపించుకునేందుకు రూ.27.44 కోట్లు డిపాజిట్ చేయాలని ఆళ్లను ఆదేశించింది. ఆ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద డిపాజిట్ చేశారు. అటు తరువాత సదావర్తి భూములకు మొదట జరిగిన వేలాన్ని రద్దు చేసిన హైకోర్టు, మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశించింది. తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సదావర్తి భూములు తమవని తమిళనాడు చెప్పడంతో రెండో వేలాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ రాష్ట్రం వాదన విన్న తరువాత వేలంపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కాగా తాను డిపాజిట్ చేసిన మొత్తం వెనక్కి ఇప్పించాలన్న రామకృష్ణారెడ్డి అనుబంధ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. -
రెండుసార్లు వేలం వేసినా స్పందించరేం?
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములు తమవంటూ ఇప్పుడు ముందుకొచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సదావర్తి భూముల వ్యవహారంలో పిల్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సదుద్దేశాన్ని నిరూపించుకునేందుకు తమ ఆదేశాల మేరకు డిపాజిట్ చేసిన రూ.27.44 కోట్లను తిరిగి చెల్లించే విషయంలో వచ్చే సోమవారం వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న అత్యంత విలువైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. రెండుసార్లు వేలం నిర్వహించినప్పుడు స్పందించ కుండా ఆ తర్వాత ఆ భూములు తమవని చెప్పడంలో అర్థమేంటని తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరయిన న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆ ప్రకటనలు ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు. -
దాచిన భూమి ‘దారి’ కొచ్చింది
-
దాచిన భూమి ‘దారి’కొచ్చింది
దాచిపెట్టిన సత్రం భూముల్లో 1.13 ఎకరాలు ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి - తాజాగా ఈ మొత్తం కలుపుతూ సర్కార్ సవరణ నోటిఫికేషన్ - మిగతా 2.99 ఎకరాలపై ఇంకా కొనసాగుతున్న గోప్యం - ‘సాక్షి’ కథనంతో బట్టబయలైన ప్రభుత్వ పెద్దల భూ‘దోపిడీ’ సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో భూముల వివరాలను దాచేసి దోచేద్దామన్న సర్కారీ పెద్దల పన్నాగాన్ని ‘సాక్షి’ ససాక్ష్యంగా బహిర్గతం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. రెండో విడత వేలం నోటిఫికేషన్లో దాచేసిన 4.12 ఎకరాల్లో 1.13 ఎకరాల భూమి వివరాలతో ప్రభుత్వం మంగళవారం అనుబంధ వేలం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో సర్కారు దురుద్దేశం బట్టబయలు కాగా, మిగిలిన 2.99 ఎకరాల భూ వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారనే అనుమానాలు కలిగించింది. సదావర్తి సత్రం భూములకు తిరిగి బహిరంగ వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసేసరికి 83.11 ఎకరాల భూమి వేలానికి విడుదల చేసిన రెండోవిడత నోటిఫికేషన్లో కేవలం 78.99 ఎకరాల సర్వే నంబర్ల వివరాలను మాత్రమే పొందుపరచడంపై ఈనెల 2న ‘సాక్షి’ ప్రచురించిన కథనం తెలిసిందే. చెన్నై నగర సమీపంలో ఉన్న తాళంబూరు గ్రామ పరిధిలో సదావర్తి సత్రం పేరిట 37 వేర్వేరు సర్వే నంబర్లలో 78.99 ఎకరాల వివరాలతోనే ప్రభుత్వం గత నెల 28న రెండో విడత నోటిఫికేషన్ జారీచేయగా.. సాక్షి కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి సర్వే వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ప్రభుత్వం మంగళవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన 37 సర్వే నెంబర్లకు తోడు అదనంగా 22/11 సర్వే నెంబరు సత్రం పేరిట ఉన్న 1.13 ఎకరాలను వేలం ప్రక్రియలో చేర్చుతూ సవరణ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2.99 ఎకరాలపై ఇప్పటికీ గోప్యతే వేలానికి పెట్టిన 83.11 సత్రం భూముల్లో 2.99 ఎకరాల భూ వివరాలపై సర్కారు ఇప్పటికీ గోప్యత పాటిస్తోంది. మొత్తం 83.11 ఎకరాల భూమిలో 78.99 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు మాత్రమే చెప్పగా.. ‘మిగతా రోడ్లు’ అంటూ 28వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్లో సర్కార్ పేర్కొంది. అప్పుడు రోడ్లులో ఉందంటూ పేర్కొన్న 4.12 ఎకరాలలో ‘సాక్షి’ కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి వివరాలు వెలుగులోకి రావడం అధికార వర్గాలను అశ్చర్యపర్చింది. ఈ అంశంపై సత్రం ఈవోని ‘సాక్షి’ ప్రతినిధి ఏమి అడిగినా.. ‘తాను సెలవులో ఉన్నాను. తననేమీ అడగవ’ద్దంటూ ముక్తసరి జవాబు ఇవ్వడంతోనే సరిపెట్టారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ కూడా దీనిపై స్పందించడానికి గతంలో నిరాకరించారు. కీలక నిబంధనల్లో మార్పు సదావర్తి సత్రం భూములకు రెండో విడత వేలం నిర్వహించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. సత్రం భూముల అమ్మకానికి 2016 మార్చి 28వ తేదీన జరిగిన వేలం ప్రక్రియకు కొనసాగింపుగానే 83.11 ఎకరాల భూమికి రూ.27.45 కోట్ల కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం నిర్వహించాలని మాత్రమే కోర్టు ప్రభుత్వానికి సూచించిందని దేవాదాయ శాఖలోని పలువురు అధికారులే గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన వేలం ప్రక్రియను రద్దు చేయకుండా కోర్టు ఆదేశాల మేరకు తిరిగి వేలం నిర్వహిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వమైనా, దేవాదాయ శాఖ అయినా మొదట విడత వేలం నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను అలాగే కొనసాగించాలి. కానీ, కొన్ని కీలకమైన నిబంధనలను మార్చేసి కొత్త నిబంధనలతో తిరిగి నోటిఫికేషన్ ఎలా జారీచేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాగా, వేలంలో నిర్ణయించిన ధర మొత్తాన్ని చెల్లించిన తర్వాత పాటదారుడు సొంత ఖర్చుతో ఆ భూములకు సత్రం ఈవో ద్వారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మొదటి విడత నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. తాజాగా రెండో విడత వేలం నోటిఫికేషన్‌కు వచ్చేసరికి.. భూముల కొనుగోలు చేసిన వారికి దేవాదాయ శాఖ రిజిస్ట్రేషన్ చేయదని ఆ నిబంధనను మార్చేసింది. కోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి ప్రభుత్వం ఇంతటి కీలకమైన నిబంధనలను ఎలా మార్చుతుందని ఆ శాఖలోని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే భూములెవరు కొంటారు? ఈ విషయంలో రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు.. వరుస పరిణామాలను చూస్తుంటే అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తక్కువ ధరలకే ఆ భూములను తిరిగి దక్కించుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వంలోని వారే రోజుకో నాటకానికి తెర తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూముల వివరాలను దాచిపెట్టి బహిరంగ వేలం నోటిఫికేషన్ జారీ అన్నది ప్రభుత్వ పెద్దల జోక్యం ఉంటే తప్ప అధికారుల స్థాయిలో ఇలాంటివి సాధ్యంకాదని ఆ శాఖకు చెందిన అధికారులే అంటున్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేసేదిలేదని ప్రభుత్వమే చెబితే, దానికి సాధికారత ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయని భూములకు బ్యాంకుల నుంచి రుణాలు ఎలా సాధ్యమవుతాయని.. అంత భూమిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకొస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.